English | Telugu

టెంపర్‌ను కంపు చేయరు కదా..?

బాహుబలి పుణ్యమా అని భారతదేశంలోని అన్ని వుడ్‌ల కన్ను ఇప్పుడు టాలీవుడ్‌ మీద పడింది. బాహుబలికి ముందు.. బాహుబలి తర్వాత తెలుగునాట హిట్టైన కథలను తమ భాషల్లోకి రీమేక్ చేసి అక్కడ హిట్లు కొడుతున్నారు ఆయా సినీ పరిశ్రమల వారు. ఇక బాలీవుడ్‌ విషయానికి వస్తే.. తెలుగు స్టోరీలను ఎక్కువ శాతం డబ్బింగ్ చేసుకునే ఆనవాయితీ ఏనాటి నుంచో ఉంది.. ఈ మధ్య కాలంలో డబ్బింగ్‌ను పెట్టి రీమేక్‌లపై పడుతున్నారు హిందీ జనాలు. రీసెంట్‌గా యంగ్‌టైగర్ ఎన్టీఆర్- పూరీ జగన్నాథ్ కాంభినేషన్‌లో వచ్చిన టెంపర్‌ను శింబాగా హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా.. రణ్‌వీర్ సింగ్ హీరోగా చేస్తున్నాడు.

న్యూస్‌ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతగానో ఆనందం కలిగించింది. పూరీ టేకింగ్‌కు.. యంగ్‌టైగర్ యాక్టింగ్‌ తోడు కావడంతో ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచి ఎన్టీఆర్‌ను నటుడిగా ఒక మెట్టు పైకి ఎక్కించింది. అందుకే టెంపర్‌ ఎన్టీఆర్‌ సినిమాల్లో స్పెషల్‌గా నిలిచింది. గురువారం శింబా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఇందులో రణ్‌వీర్ పాత్ర పేరు భలేరావు అట.. పోలీస్ డ్రెస్‌లో మెడలో ఐరన్ చైన్ వేసుకుని.. రణ్‌వీర్ కేకలు పెడుతున్న లుక్‌ని చూసి నందమూరి అభిమానులు టెన్షన్ పడుతున్నారట. టెంపర్‌లో ఎన్టీఆర్ కరప్టడ్ పోలీస్‌ ఆఫీసర్‌గా చూపిన ఎమోషన్స్‌‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.. విమర్శకులు కూడా జూనియర్ నటనపై ప్రశంసలు కురిపించారు. కానీ శింబా పోస్టర్‌ చూస్తుంటే హీరో కామెడీకే పరిమితం అవుతాడేమోనని అభిమానులు భయపడుతున్నారట. పైగా ఈ మూవీ డైరెక్టర్ రోహిత్‌శెట్టి‌ సినిమాల్లో కామెడీకి మోస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఎస్ట్‌మేట్ వేసుకుంటున్న ఫ్యాన్స్‌ని టెంపర్‌ని కంపు చేస్తారేమోనని భయపడుతున్నారంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.