English | Telugu

వెంకీతో మ‌రోసారి త్రిష‌?

విక్ట‌రీ వెంక‌టేశ్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన నాయిక‌ల్లో చెన్నైపొన్ను త్రిష ఒక‌రు. `ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే`(2007), `న‌మో వెంక‌టేశ‌` (2010), `బాడీగార్డ్` (2012) చిత్రాల్లో ఈ ఇద్ద‌రు జంట‌గా న‌టించారు. వీటిలో `ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే` ఘ‌న‌విజ‌యం సాధించింది. క‌ట్ చేస్తే.. దాదాపు ప‌దేళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం వెంకీ, త్రిష మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌నున్న‌ట్లు టాక్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన `ఎన్నై అరిందాళ్` (2015) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే `ఎంత‌వాడు గానీ` పేరుతో అనువాదమైన ఈ సినిమాని.. మార్పుచేర్పుల‌తో, తెలుగు నేటివిటికి త‌గ్గ‌ట్టు రీమేక్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. అంతేకాదు.. ఇందులో వెంకీ హీరోగా న‌టించ‌బోతున్నార‌ని వినికిడి. కాగా, మాతృక‌లో త్రిష‌, అనుష్క నాయిక‌లుగా న‌టించ‌గా.. రీమేక్ లో త్రిష త‌న పాత్ర‌ని తానే చేయ‌బోతున్న‌ట్లు బ‌జ్. త్వ‌ర‌లోనే `ఎన్నై అరిందాళ్` రీమేక్ వార్త‌ల‌పై క్లారిటీ రానుంది.

మ‌రి.. వెంకీ, త్రిష జంట నాలుగోసారి కూడా ఎంట‌ర్టైన్ చేస్తుందేమో చూడాలి.