English | Telugu

కొత్త ఏడాది ఈ హీరోలకి హిట్టిస్తుందా?

కొత్త సంవత్సరంలో ప్రతీ ఒక్కరూ సరికొత్త ఆశలు, ఆశయాలతో అడుగుపెడతారు. ఈ సారి తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఎన్నో ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా జనవరి లో బాక్స్ ఆఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొనబోతుంది.

న్యూఇయర్ రోజే రామ్‌ ‘నేను.. శైలజ’ చిత్రంతో సందడి చేయనున్నాడు. ‘నేను శైలజ’ లాంటి కాస్త భిన్నమైన సినిమా చేశాడు రామ్. ఈ సినిమా తనకు విజయాన్నందించడంతో పాటు భిన్నమైన సినిమాలు చేయనన్న అపప్రదను కూడా తొలగిస్తుందని రామ్ ఆశిస్తున్నాడు.

ఇక సంక్రాంతి బరిలో మొదటగా ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' తో రాబోతున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేషంగా అలరిస్తున్నాయి. అన్నట్లు ఎన్టీఆర్‌కు ఇది 25వ చిత్రం కావడం, సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక బాలకృష్ణ కూడా సంక్రాంతి బరిలోకి దిగనున్నారు.

డిక్టేటర్ గురించి చెప్పనక్కరలేదు. పక్కా బాలయ్య స్టయిల్ సినిమా. పవర్ ఫుల్ డైలాగులు, బాలయ్య టైపు డ్యాన్స్ లు , పాటలు. రివెంజ్ స్టోరీ. ఇక సోగ్గాడే చిన్ని నాయనా..ఇటీవల కాస్త ఆదరణకు నోచుకుంటున్న ఘోస్ట్ కామెడీ అనుకోవాలి. మరో సినిమా ఎక్స్ ప్రెస్ రాజా. యువి..శర్వానంద్..మేర్లపాక మురళి కలిసి అందిస్తున్న క్లాస్ కామెడీ. మరి ఈ సినిమాలు ఆ హీరోలకు ఎలాంటి ఫలితాల్ని ఇస్తాయో చూడాలి.