English | Telugu

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నాగ చైతన్య!!

అక్కినేని నాగ చైతన్య వరుసగా క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల, విక్రమ్ కుమార్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పనిచేస్తున్న చైతన్య.. మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని సమాచారం.

'పెళ్లి చూపులు' సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కి పరిచయమైన తరుణ్.. మొదటి సినిమాతోనే మెప్పించాడు. ఆ తరువాత 'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో యూత్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తరుణ్ డైరెక్టర్ గా తన మూడో సినిమాని నాగ చైతన్య తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం.

నాగచైతన్య చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ స్టొరీ' విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్నాడు. నాగార్జున హీరోగా నటిస్తున్న 'బంగార్రాజు'లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే అమీర్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ మూవీ 'లాల్ సింగ్ చద్దా'లో నటిస్తున్నాడు.