English | Telugu

సూర్యకి టెన్ష‌న్ పుట్టిస్తున్న స‌మంత‌

నిన్న మొన్న‌టి వ‌ర‌కు స‌మంత పేరు టాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్‌. ఆమె ఓ సినిమాలో న‌టిస్తుందంటే.. అది క‌చ్చితంగా హిట్ మూవీగా నిలుస్తుంద‌నే న‌మ్మ‌కం ఇక్క‌డి వారిలో ఉండేది. అయితే ఈ మ‌ధ్య స‌మంత ప‌ప్పులేవీ ఉడ‌క‌డం లేదు. చేసిన సినిమాలు చేసిన‌ట్లుగా బోల్తా ప‌డుతున్నాయి. ఆటో న‌గ‌ర్ సూర్య‌, అల్లుడు శీను, ర‌భ‌స‌, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి.. ఇలా వ‌రుస‌గా స‌మంత న‌టించిన‌ నాలుగు తెలుగు సినిమాలు లాభాల పంట‌ని ఏ మాత్రం పండించ‌లేక‌పోయాయి. అయితే త‌మిళంలో మాత్రం ఈ గ్యాప్‌లో క‌త్తి అనే బ్లాక్‌బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకుని రిలీఫ్ పొందింది ఈ అమ్మ‌డు.
ఇదిలా ఉంటే.. స‌మంత తాజాగా సూర్య‌తో 24 అనే ఓ త‌మిళ సినిమా చేస్తోంది. దీనికి మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌కుడు. విక్ర‌మ్‌తో మ‌రోసారి ప‌నిచేయ‌డాన్ని స‌మంత ఆస్వాదిస్తుంటే.. సూర్య మాత్రం కాస్త టెన్ష‌న్ గా ఫీల‌వుతున్నాడ‌ట‌. అది ఎందుకంటే..స‌మంత త‌న‌కు హిట్‌నిచ్చిన ద‌ర్శ‌కుల‌తో రెండోసారీ ఆ రిజ‌ల్ట్‌ని పొంద‌లేక‌పోవ‌డ‌మేన‌ట‌. ఏమాయ చేసావే త‌రువాత గౌత‌మ్ మీన‌న్‌తో చేసిన ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు.. అత్తారింటికి దారేది త‌రువాత త్రివిక్ర‌మ్‌తో చేసిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఆశించిన విజ‌యాలు సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో మ‌నం త‌రువాత విక్ర‌మ్‌తో చేస్తున్న సినిమా ఎలాంటి ఫ‌లితం అందుకుంటుందోన‌న్న ఓ కొత్త టెన్ష‌న్ సూర్య‌లో మొద‌లైంద‌ట‌. అన్న‌ట్టు.. స‌మంతతో సూర్య న‌టించిన సికింద‌ర్ కూడా హిట్ లిస్ట్‌లోకి చేరుకోలేదు. ఈ ట్రాక్ రికార్డు దృష్ట్యా సూర్య టెన్ష‌న్ స‌రైన‌దేనంటున్నారు త‌మిళ‌తంబీలు.