English | Telugu

సూపర్‌స్టార్‌కి సూపర్‌స్టార్ హ్యాండిస్తాడా..?

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, మళయాళ సూపర్‌స్టార్ కలిసి నటించిన "దళపతి" ఆ రోజుల్లో పెద్ద సంచలనం. ఇద్దరు అప్పుడప్పుడే సూపర్‌స్టార్లుగా ఎదుగుతున్న కాలమది. ఎలాంటి భేషజాలు లేకుండా నటించడంతో వారి నటనకు మంచి మార్కులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ సినిమా నుంచి ఇద్దరికి మంచి ఫ్రెండ్‌షిప్ కూడా కుదిరింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరితో మల్టీస్టారర్ తీయాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ వీలుపడలేదు.

అయితే అభిమానుల ఆశలు ఫలించి రజనీని, మమ్ముట్టి మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో రజినీ "కాలా" అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. కబాలి లాగే "కాలా"ను కూడా భారీ రేంజ్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్న పా రంజిత్..ఈ మూవీ రేంజ్‌ను మరింత పెంచేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాడు. దీనిలో భాగంగా మళయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిని ఇందులో ఓ కేమియో రోల్‌ చేయమని కోరాడట రంజిత్. అయితే దీనిపై మమ్ముట్టి ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదట. రంజిత్ ప్రయత్నాలు ఫలించి ఒకవేళ మళయాళ సూపర్‌స్టార్ అంగీకరిస్తే పాతికేళ్లనాటి అద్భుతం మళ్లీ రిపీట్ అయ్యినట్లే. ఇంతకంటే అభిమానులకు కావాల్సింది ఏముంది.