English | Telugu

భరత్ అనే నేను.. జగన్ కోసమా..?

సినిమాలకు.. రాజకీయాలకు మనదేశంలో విడదీయరాని సంబంధం ఉంది. సూపర్‌స్టార్లుగా వెలుగొందిన ఎంతోమంది పొలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంత సాహసం చేయలేని స్టార్లు తమకు ఇష్టమైన నాయకుల కోసం ప్రచారం చేయడమో.. లేదంటే తమ సినిమాల్లో సదరు నేతల‌ ప్రస్తావన తీసుకురావడమో చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇలాంటి పైత్యం తెలుగునాట కాస్త ఎక్కువగానే ఉంటుందన్నది ఓపెన్ టాక్. మన దగ్గర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి సినీజనాలు నీరాజనాలు పట్టిన సంఘటనలు ఎన్నో. ఈ సంగతి పక్కనబెడితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "భరత్ అనే నేను" సినిమా చేస్తున్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు.

పక్కా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా బేస్ లైన్‌ అంతా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉంటుందని.. ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. సీన్ కట్ చేస్తే.. మహేశ్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ తొలి నుంచి కాంగ్రెస్‌‌వాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపుతో ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.. ఆ తర్వాత వైఎస్ కుటుంబంతోనూ కృష్ణ సన్నిహితంగా మెలిగారు.

రాబోయే ఎన్నికల్లో సూపర్‌స్టార్ ఫ్యామిలీ వైసీపీకి మద్దతుగా నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే భరత్ అనే నేను‌లో జగన్‌కు పాజిటివ్‌గా కంటెంట్ ఉండబోతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో వాస్తవమెంతో తెలియదు కానీ.. "భరత్ అనే నేను"ని ఎడిట్ చేసి "జగన్ అనే నేను"గా మార్చేసి.. సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు జగన్ అభిమానులు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేశ్ సరసన కైరా అద్వానీ నటిస్తోంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న "భరత్ అనే నేను" ప్రేక్షకుల ముందుకు వస్తోంది.