English | Telugu

సునీల్ ఇక షెడ్డుకేనా??

సునీల్‌కి దెబ్బ‌మీద దెబ్బ ప‌డుతూనే ఉంది. వ‌రుస ఫ్లాపుల‌తో ఈ భీమవ‌రం బుల్లోడు షెడ్డు కెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. కృష్ణాష్ట‌మి. జ‌క్క‌న్న సినిమాలు దారుణంగా నిరాశ ప‌రిచాయి. ద‌స‌రా బ‌రిలో నిలిచిన ఈడు గోల్డ్ ఎహే.. కూడా అంతే! ఈసినిమాకి ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వ‌చ్చాయి. ఇది వ‌ర‌కు సునీల్ సినిమా అంటే బీసీల్లో తెగ చూసేవారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. అందుకు ఈడు గోల్డ్ ఎహే సినిమాకి వ‌చ్చిన ఓపెనింగ్సే సాక్ష్యం. ఈ సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ట్విస్టులు త‌ప్ప క‌థ లేక‌పోవ‌డంతో... ఈ సినిమాకి అటు ప్రేక్ష‌కులు, ఇటు విమ‌ర్శ‌కులు తిప్పి కొట్టారు. సునీల్ న‌ట‌న‌లోనూ కొత్త ద‌నం క‌నిపించ‌లేదు. అవే స్టెప్పులూ, అవే డాన్సులు, పాత పంచ్‌లు అన్న‌ట్టు త‌యారైంది సునీల్ ప‌రిస్థితి. క‌మిడియ‌న్ గా ఉన్న‌ప్పుడు సునీల్ బండి భ‌లే స్పీడుగా సాగిపోయేది. స‌క్సెస్, ఫెయిల్యూర్ల‌తో సంబంధం ఉండేది కాదు. కానీ హీరో అయ్యాక ఆ సౌల‌భ్యం ఉండ‌దు. ఒక్క ఫ్లాప్ ప‌డితే.. కెరీర్ లో కుదుపులు మొద‌ల‌వుతాయి. అలాంటిది సునీల్ ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టాడు. ఇక సునీల్ ప‌రిస్థితి కష్ట‌మ‌ని, రాబోయే.. క్రాంతిమాధ‌వ్ సినిమా కూడా అటూ ఇటూ అయితే.. సునీల్ కి హీరోగా కెరీర్ ముగిసిన‌ట్టే అని విశ్లేష‌కులు చెబుతున్నారు.