English | Telugu

బన్నీకి ఎవ్వరితోనూ పడటం లేదా..?

టాలీవుడ్‌ బడా స్టార్ల డైరీలన్ని దాదాపు రెండు, మూడేళ్లు వరకు ఖాళీ లేవు.. కథలున్నాయి.. దర్శకులన్నారు కానీ స్టార్ హీరోలెవరు సిద్ధంగా లేరు. త్రివిక్రమ్‌ తో సినిమా తర్వాత పవర్‌స్టార్ పొలిటిక్స్‌తో ఫుల్ బిజీ.. ఇక మహేశ్ సంగతి చూస్తే ప్రస్తుతం కొరటాల శివతో "భరత్ అను నేను".. ఆ తర్వాత వంశీ పైడిపల్లి.. ఆ వెంటనే బోయపాటికి ఛాన్స్ ఇచ్చేశాడు.. ఎన్టీఆర్ విషయానికి వస్తే త్రివిక్రమ్‌ సినిమాకి కొబ్బరికాయ కొట్టేశాడు. దీనికి తోడు చరణ్‌తో రాజమౌళి మల్టీస్టారర్‌ తీస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇక చెర్రీ విషయానికి వస్తే "రంగస్థలం 1985" ఆల్‌మోస్ట్ కంప్లీట్ స్టేజ్‌కి వచ్చేసింది. బోయపాటితో సినిమాకి ఓపెనింగ్ జరిగిపోయింది. ఇక ఎన్టీఆర్‌తో రాజమౌళి మల్టీస్టారర్ సంగతి సరేసరి.

‘బాహుబలి’ సినిమాలతో దాదాపు మూడేళ్లు రాజమౌళికి రాసిచ్చేసిన ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ చేస్తున్నాడు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా ఉంటుందట. ఇక మిగిలిన ఏకైక హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే.. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "నా పేరు సూర్య" తప్ప బన్నీ చేతుల్లో మరో ప్రాజెక్ట్ లేదు. అప్పట్లో లింగుస్వామి దర్శకత్వంలో కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించి.. చెన్నైలో చిన్న సైజు ఈవెంట్ చేశారు కూడా.. కానీ అది ఇంతవరకు పట్టాలెక్కలేదు. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్‌.. అర్జున్‌కి ఓ లైన్ చెప్పాడు అది బన్నీకి కూడా బాగా నచ్చిందట.. దాని కథ మధ్యలోనే ఆగిపోయింది.. ఇలా కథలు వినడం ఓ నిర్ణయానికి రాకపోవడం జరుగుతుంది తప్పించి అది ముహూర్తపు షాట్ వరకు వెళ్లడం లేదని ఫిల్మ్‌నగర్‌లో జోరుగా చర్చించుకుంటున్నారు. మరి స్టైలిష్ స్టార్ నెక్ట్స్ మూవీ ఎవరితోనే తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.