English | Telugu

స‌ల్మాన్‌ను క‌లిసిన రాజ‌మౌళి.. సినిమా కోస‌మేనా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీని 2022 జ‌న‌వ‌రి 7న రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తుండ‌గా, ముంబైలో ఆ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌తో బిజీగా ఉన్నాడు డైరెక్ట‌ర్ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి. ఈ సినిమా కోసం దేశ‌మంతా క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తోంది. చారిత్ర‌క పురుషులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ పాత్ర‌ల‌ను తీసుకొని 1900 తొలినాళ్ల నేప‌థ్యంలో ఒక క‌ల్పిత క‌థ‌తో ఈ మూవీని రాజ‌మౌళి రూపొందించాడు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మూవీ ప్ర‌మోష‌న్‌, మార్కెటింగ్ విష‌యాల‌పై ఆయ‌న ఫుల్ ఫోక‌స్ పెట్టాడు. 'బాహుబ‌లి'ని మించిన స్థాయికి ఆర్ఆర్ఆర్‌ను తీసుకుపోవ‌డానికి అన్ని అస్త్రాలూ సిద్ధం చేస్తున్నాడు.

లేటెస్ట్‌గా ఆయ‌న ముంబైలో స‌ల్మాన్ ఖాన్‌ను క‌లిసిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌లో ఉన్న స‌ల్మాన్‌ను క‌ల‌వ‌డానికి రాజ‌మౌళి వెళ్లిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి కూడా. ఆ ఫొటోలో రాజ‌మౌళి కొడుకు కార్తికేయ కూడా క‌నిపిస్తున్నాడు. స‌ల్మాన్‌, రాజ‌మౌళి క‌ల‌యిక‌లో మూవీ రానున్న‌దా? అయితే, లేటెస్ట్ రిపోర్టులు వేరే విష‌యం చెబుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించ‌డానికే ఆయ‌న‌ను జ‌క్క‌న్న క‌లిశాడంటున్నారు.

అటు ముంబై, ఇటు హైద‌రాబాద్‌ల‌లో 'ఆర్ఆర్ఆర్' ప్రి రిలీజ్ ఈవెంట్ల‌ను ప్లాన్ చేస్తున్నారు. ముంబైలో జ‌రిగే ఈవెంట్‌కు స‌ల్మాన్‌ను ఆయ‌న చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించాడ‌నేది స‌మాచారం. స‌ల్మాన్ ఓకే చెప్ప‌కుండా ఉండే అవ‌కాశం లేద‌ని కూడా వినిపిస్తోంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే గ‌తంలో త‌న తండ్రి క‌థ స‌మ‌కూర్చ‌గా స‌ల్మాన్ హీరోగా న‌టించిన 'భ‌జ‌రంగి భాయీజాన్' మూవీకి డైరెక్ష‌న్‌ చేసే ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడు రాజ‌మౌళి సున్నితంగా తిర‌స్క‌రించాడు. 'బాహుబ‌లి' సిరీస్‌తో బిజీగా ఉండ‌టంతో పాటు, హిందీ మూవీకి డైరెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఆ టైమ్‌లో లేక‌పోవ‌డ‌మే అందుకు కార‌ణం.