English | Telugu

'స్పిరిట్'లో ప్ర‌భాస్ పాత్ర అదేనా!

వ‌రుసగా పాన్ - ఇండియా మూవీస్ చేస్తూ.. అభిమానుల్లో జోష్ నింపుతున్నారు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. 2022 సంక్రాంతికి `రాధే శ్యామ్`తో ప‌ల‌క‌రించ‌నున్న ఈ ఉప్ప‌ల‌పాటి వారి హ్యాండ్సమ్ హీరో.. అదే ఏడాది పంద్రాగ‌స్టు వారాంతంలో `ఆదిపురుష్`గా అల‌రించ‌నున్నారు. అలాగే వ‌చ్చే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లోనే `స‌లార్`తో సంద‌డి చేయ‌నున్నారు. ఇక 2023 ప్ర‌థ‌మార్ధంలో `ప్రాజెక్ట్ కె`తో ఎంట‌ర్టైన్ చేయ‌నున్న ప్ర‌భాస్.. అదే సంవ‌త్స‌రం చివ‌ర‌లో త‌న ల్యాండ్ మార్క్ ఫిల్మ్ `స్పిరిట్`తో వినోదాలు పంచ‌నున్నారు.

త‌న కెరీర్ లో 25వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయ‌నున్నారు. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో ప్ర‌భాస్ ఓ సూప‌ర్ కాప్ గా క‌నిపిస్తార‌ట‌. త‌న మార్క్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో పాటు అంత‌కు మించి స్ట‌ఫ్ కూడా ఇవ్వ‌బోతున్నార‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే 2023 ద్వితీయార్ధం వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న `స్పిరిట్`లో ప్ర‌ముఖ‌ తారాగ‌ణ‌మే సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. అలాగే సాంకేతికంగానూ ఉన్న‌తంగా ఉంటుంద‌ని టాక్. కాగా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల‌తో పాటు జ‌ప‌నీస్, చైనీస్, కొరియ‌న్ భాష‌ల్లోనూ `స్పిరిట్` ఏక‌కాలంలో థియేట‌ర్స్ లోకి రానుంది.