English | Telugu

తార‌క్ సినిమాతో సోనాలి బింద్రే రి-ఎంట్రీ!

తెలుగునాట ప‌రిమిత సంఖ్య‌లోనే సినిమాలు చేసినా.. దాదాపుగా అగ్ర క‌థానాయ‌కుల‌తోనే జోడీక‌ట్టి న‌టిగా ఎన‌లేని గుర్తింపుని తెచ్చుకుంది సోనాలి బింద్రే. `మురారి`, `ఇంద్ర‌`, `ఖ‌డ్గం`, `మ‌న్మ‌థుడు`, `ప‌ల‌నాటి బ్ర‌హ్మనాయుడు`, `శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్` వంటి తెలుగు సినిమాల్లో నేరుగా సంద‌డి చేసిన సోనాలికి.. ఒక్క `ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు` మిన‌హాయిస్తే మిగిలిన చిత్రాల‌న్నీ మంచి విజ‌యాన్ని అందించాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, కింగ్ నాగార్జున, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు స‌ర‌స‌న చూడ‌చ‌క్క‌ని నాయిక‌గా ప్ర‌త్యేక గుర్తింపుని సంపాదించుకుంది సోనాలి.

కాగా, పెళ్ళ‌య్యాక క్ర‌మంగా టాలీవుడ్ కి దూర‌మైన సోనాలి బింద్రే.. త్వ‌ర‌లో ఓ పాన్ - ఇండియా మూవీలో న‌టించ‌బోతోంద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `జ‌న‌తా గ్యారేజ్` వంటి సంచ‌ల‌న చిత్రం త‌రువాత యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్, విజ‌న‌రీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టించ‌నుండ‌గా.. ఓ ప్ర‌ధాన పాత్ర కోసం సోనాలి బింద్రేని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే తార‌క్ - కొర‌టాల కాంబో మూవీలో సోనాలి ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. రి-ఎంట్రీలో సోనాలి ఏ స్థాయిలో ఆక‌ట్టుకుంటుందో చూడాలి.