English | Telugu
వైఎస్ జగన్ గా 'స్కామ్ 1992' ఫేమ్ ప్రతీక్ గాంధీ!!
Updated : Jul 2, 2021
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి కావడంలో ఆయన సాగించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ దర్శకత్వంలో 'యాత్ర' మూవీ తెరకెక్కింది. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదలైన ఈ సినిమా వైసీపీకి మైలేజ్ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అంటూ మమ్ముట్టి చెప్పిన మాటను.. వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం పదేపదే ఉపయోగించారు. అంతటి ప్రభావం చూపిన యాత్ర సినిమాకు సీక్వెల్ రానుంది.
వైఎస్సార్ మాదిరిగానే వైఎస్ జగన్ కూడా పాదయాత్ర చేశారు. వైఎస్సార్ మరణం తరువాత జగన్ కొత్త పార్టీ పెట్టడానికి దారితీసిన పరిస్థితులు నుంచి ఆయన సీఎం అయ్యేవరకు వరకు యాత్ర సీక్వెల్ లో చూపించనున్నారట. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో కనిపించబోయే నటుడిని కూడా ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జగన్ పాత్రకు బాలీవుడ్ నటుడు, 'స్కామ్ 1992' ఫేమ్ ప్రతీక్ గాంధీని ఎంపిక చేశారట. ఇటీవల దర్శకుడు మహి.. ప్రతీక్ గాంధీని కలిసి స్టోరీ నెరేట్ చేయగా.. ఆయన ఇంప్రెస్ అయ్యారని, సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
యాత్ర సీక్వెల్ ను వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గత ఎన్నికల సమయంలో యాత్ర మూవీ ఎలా ప్లస్ అయ్యిందో.. వచ్చే ఎన్నికల్లో యాత్ర సీక్వెల్ అలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారట.