English | Telugu
నానితో సామ్.. ముచ్చటగా మూడోసారి!
Updated : Oct 31, 2021
తెలుగువారికి కనువిందు చేసిన జంటల్లో నాని - సమంత జోడీ ఒకటి. 2012లో విడుదలైన `ఈగ`, `ఎటో వెళ్ళిపోయింది మనసు` చిత్రాల కోసం ఈ ఇద్దరూ జతకట్టారు. ఇద్దరికీ కూడా ఇవి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ నే కావడం విశేషం. `ఈగ` కమర్షియల్ గా మంచి విజయం సాధించగా.. `ఎటో వెళ్ళిపోయింది మనసు` విమర్శకుల ప్రశంసలతో పాటు ఇద్దరికి కూడా `ఉత్తమ నటీనటులు`గా `నంది` పురస్కారాలు అందించింది. కట్ చేస్తే.. దాదాపు పదేళ్ళ తరువాత నాని - సామ్ మరోమారు జట్టుకట్టనున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `దసరా` పేరుతో నాని కథానాయకుడిగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఓదెల శ్రీకాంత్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో కేరళకుట్టి కీర్తి సురేశ్ ఓ హీరోయిన్ గా ఎంపికైంది.
కాగా, ఇందులో మరో నాయికకు కూడా స్థానముందని.. ఆ పాత్రలో నటింపజేసేందుకు సమంతతో `దసరా` యూనిట్ సంప్రదింపులు జరిపిందని వినికిడి. కథ, తన పాత్ర నచ్చడంతో సామ్ కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టీటౌన్ టాక్. త్వరలోనే `దసరా`లో సామ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్న నాని, సమంత.. ఈ సారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.