English | Telugu

అక్కాచెల్లెళ్లుగా స‌మంత‌, ర‌ష్మిక‌?

టాలీవుడ్ టాప్ హీరోయిన్లు స‌మంతా అక్కినేని, ర‌ష్మికా మంద‌న్న అక్కాచెల్లెళ్లుగా తెర‌పై క‌నిపించ‌నున్నారా? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. ఆ ఇద్ద‌రినీ ఒక ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్‌తో ఒక డైరెక్ట‌ర్ సంప్ర‌దించాడ‌నీ, స్క్రిప్ట్‌తో పాటు త‌మ క్యారెక్ట‌ర్లు కూడా బ‌లంగా ఉండ‌టంతో వారు అత‌నికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌నీ చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై ఇండ‌స్ట్రీలో ప్ర‌చారమ‌వుతుంది త‌ప్పితే ఆ ఇద్ద‌రు నాయిక‌ల వైపు నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. ర‌ష్మిక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ జోడీగా 'పుష్ప' సినిమా చేస్తోంది. ఈ ఏడాది 'స‌రిలేరు నీకెవ్వ‌రు', 'భీష్మ' చిత్రాల స‌క్సెస్‌తో ఆమె క్లౌడ్ 9 మీద ఉంది.

మ‌రోవైపు స‌మంత‌కు గ‌త ఏడాది 'ఓ బేబీ' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చిన సంతోషాన్ని 'జాను' వంటి డిజాస్ట‌ర్ లాగేసుకుంది. దాని త‌ర్వాత ఆమె ఇంత‌వ‌ర‌కు ఏ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. రెండు సినిమాల‌కు సంత‌కాలు చేసింది. ఒక‌టి 'గేమ్ ఓవ‌ర్' ఫేమ్ అశ్విన్ శ‌ర‌వ‌ణన్ డైరెక్ష‌న్‌లో కాగా, మ‌రొక‌టి న‌య‌న‌తార‌తో క‌లిసి న‌టించ‌నున్న విఘ్నేశ్ శివ‌న్ మూవీ. ఈ రెండూ సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్నాయి. స‌మంత‌, ర‌ష్మిక క‌లిసి న‌టించే అవ‌కాశ‌మున్న సినిమా గురించిన మ‌రింత స‌మాచారం త్వ‌ర‌లో వెల్ల‌డి కావ‌చ్చు.