English | Telugu

మెగాస్టార్ చిత్రంలో స‌ల్లూ భాయ్?

న‌టుడిగా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ది 33 ఏళ్ళ సినీ ప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో అన‌తి కాలంలోనే అగ్ర క‌థానాయ‌కుడు అనిపించుకున్నాడు స‌ల్లూ భాయ్. అంతేకాదు.. త‌ను న‌టించిన హిందీ చిత్రాల‌తో ద‌క్షిణాది సినీ ప్రియుల మ‌న‌సును కూడా దోచుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ద‌క్షిణాది చిత్రాల్లో న‌టించ‌ని స‌ల్మాన్ ఖాన్ త్వ‌ర‌లో ఓ తెలుగు చిత్రంలో సంద‌డి చేయ‌బోతున్నాడ‌ట‌. అది కూడా.. ఓ మ‌ల‌యాళ రీమేక్ కోసం. ఆ వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `హ‌నుమాన్ జంక్ష‌న్` ఫేమ్ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసిఫ‌ర్`కి రీమేక్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో స‌ల్లూ భాయ్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మాతృక‌లో పృథ్వీరాజ్ ధ‌రించిన వేషంలో స‌ల్మాన్ క‌నిపిస్తాడ‌ని.. చిరంజీవితో ఉన్న అనుబంధం కార‌ణంగానే ఈ రీమేక్ లో న‌టించేందుకు అత‌ను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని బ‌జ్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.

కాగా, ప్ర‌స్తుతం స‌ల్మాన్ చేతిలో `అంతిమ్` చిత్రం ఉంది. మ‌రోవైపు `టైగ‌ర్ 3`, `భాయీ జాన్` సినిమాల‌ను ప‌ట్టాలెక్కించే దిశ‌గా ఉన్నాడు స‌ల్లూ భాయ్.