English | Telugu
తారక్ తండ్రిగా అజయ్ దేవగణ్!
Updated : Jun 27, 2021
'బాహుబలి' సిరీస్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ - ఇండియా మూవీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. కాగా, పిరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనుండగా.. కొమురం భీమ్ గా తారక్ దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. 'ఆర్ ఆర్ ఆర్'లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ పోషిస్తున్న పాత్ర ఏంటో ఇప్పటివరకు చిత్రబృందం నుంచి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా అజయ్ పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. కొమరం భీమ్ (తారక్)కి తండ్రి పాత్రలో ఆయన కనిపించనున్నాడట. అలాగే, స్వాతంత్ర్య పోరాట యోధుడు అయిన అజయ్.. తారక్, చరణ్ కి ఎలాంటి స్ఫూర్తి కలిగించాడు? అనేది కూడా సినిమాలో కీలకాంశం అని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' చిత్రీకరణ తుదిదశలో ఉంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్'కి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. అలియా భట్, శ్రియ, సముద్రకని ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.