English | Telugu

దిల్‌రాజు ఎకౌంట్‌లో... రెండు కోట్లు?

దిల్‌రాజుది భ‌లే బుర్ర‌. అది పాద‌ర‌సంలా ప‌నిచేస్తుంది. పోస్ట‌రు చూసి సినిమా హిట్ట‌వుతుందో లేదో చెప్పేస్తుంటాడు. అంత‌టి తెలివితేట‌లున్నాయి. ఈ బ్యాన‌ర్ నుంచి సినిమా వ‌స్తోందంటే ఆశ‌లు పెట్టుకోవొచ్చు అన్న గ్యారెంటీ క‌ల్పించాడు. దిల్‌రాజు బ్యాన‌ర్ నుంచి ఈ వారం రెమో అనే సినిమా వ‌స్తోంది. శివ‌కార్తికేయ‌న్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ఈ సినిమా త‌మిళంలో సూప‌ర్ డూప‌ర్ హిట్‌. ఈ సినిమాని తెలుగులో దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నాడు. ఇందులో చెప్పుకోద‌గిన విష‌యం ఏమిటంటే.... ఈ సినిమా కోసం దిల్‌రాజు పైసా ఖ‌ర్చు పెట్టింది లేద‌ట‌. దానికి తోడు ఎదురు రూ.2 కోట్లు తీసుకొన్నాడ‌ట‌. త‌న బ్యాన‌ర్ పేరు వాడుకొన్నందుకు.

త‌మిళ నిర్మాత‌లే ఈ సినిమానీ తెలుగులో విడుద‌ల చేస్తున్నార‌ని, ఇందుకోసం దిల్‌రాజుకి రూ.2 కోట్లు చెల్లించార‌ని చెబుతున్నారు. అందుకే దిల్ రాజు ఈ సినిమాని తెగ ప్ర‌మోట్ చేస్తున్నాడు. ` ఈ సినిమా హిట్ట‌వుతుంది.. నాదీ గ్యారెంటీ` అంటూ ఒట్లు కూడా వేస్తున్నాడు. రెండు కోట్లు ఇచ్చారుగా.. ఎన్ని మాట‌లైనా చెప్పొచ్చు. సినిమా హిట్ట‌యినా, ఫ‌ట్ట‌యినా దిల్‌రాజుకి న‌ష్టం ఏం లేదు. రెండు కోట్లు ఎప్పుడో ఎకౌంట్‌లో ప‌డిపోయాయిగా.