English | Telugu

ర‌వితేజ‌తో విజ‌య్ సేతుప‌తి?

`మాస్ట‌ర్`, `ఉప్పెన‌` చిత్రాల‌తో తెలుగు వారికి మ‌రింత చేరువ‌య్యాడు కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్ సేతుప‌తి.. త్వ‌ర‌లో తెలుగునాట ఓ మ‌ల్టిస్టార‌ర్ చేయ‌బోతున్నాడ‌ట‌. అది కూడా.. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన `డ్రైవింగ్ లైసెన్స్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని పొందార‌ని టాక్. కాగా, ఒరిజిన‌ల్ లో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర‌లో ర‌వితేజ ద‌ర్శ‌న‌మివ్వ‌నుండ‌గా.. సూరజ్ ధ‌రించిన వేషంలో విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తార‌ని వినికిడి. త్వ‌ర‌లోనే ర‌వితేజ‌, విజ‌య్ సేతుప‌తి కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ర‌వితేజ ప్ర‌స్తుతం `ఖిలాడి` చేస్తున్నారు. ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. మే 28న థియేట‌ర్స్ లోకి రానుంది. ఆపై త్రినాథ‌రావ్ న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌బోతున్నారు. మే నెల‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్.. ఏడాది చివ‌ర‌లో రిలీజ‌య్యే అవ‌కాశ‌ముందంటున్నారు.