English | Telugu

నాని సినిమాకి నో చెప్పిన ర‌ష్మిక‌?

నాగ‌శౌర్య స‌ర‌స‌న న‌టించిన 'ఛ‌లో' మూవీ ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది క‌న్న‌డ సుంద‌రి ర‌ష్మికా మంద‌న్న‌. ఆ సినిమా హిట్ట‌వ‌డం, అందులో ర‌ష్మిక అంద‌చందాలు, అభిన‌యం ఆక‌ట్టుకోవ‌డంతో 'గీత గోవిందం' సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ జోడీగా న‌టించే ఛాన్స్ కొట్టేసింది. ప‌ర‌శురామ్ డైరెక్ట్ చేసిన ఆ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంతో సెన్సేష‌న‌ల్ రైజింగ్ స్టార్‌గా మారిపోయింది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌తో న‌టించిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు', నితిన్ స‌ర‌స‌న చేసిన 'భీష్మ' సినిమాలు 2020లో ఆమెకు హిట్లనిచ్చి, తారాప‌థానికి చేర్చాయి. ప్ర‌స్తుతం ఆమె సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ జోడీగా న‌టిస్తోంది.

తాజాగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం నాని హీరోగా న‌టిస్తోన్న 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో ఓ నాయిక‌గా న‌టించ‌డానికి వ‌చ్చిన ఆఫ‌ర్‌ను ఆమె తిర‌స్క‌రించింది. అందులో న‌టించేందుకు మంచి రెమ్యూన‌రేష‌న్‌నే నిర్మాత‌లు ఆఫ‌ర్ చేసినా ఆమె కాద‌న‌డం చ‌ర్చ‌నీయాంశంటున్నారు. ఇన్‌సైడ‌ర్స్ అభిప్రాయం ప్రకారం మ‌రో హీరోయిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం ఇష్టం లేక‌నే, సోలో హీరోయిన్ సినిమాల‌కే ప్రిఫ‌రెన్స్ ఇస్తున్నందునే 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను ఆమె రిజెక్ట్ చేసింది. పైగా అందులో ఇప్ప‌టికే ఓ నాయిక‌గా సాయిప‌ల్ల‌వి ఎంపిక‌వ‌డం, ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం కూడా ర‌ష్మిక నిర్ణ‌యానికి కార‌ణంగా చెప్పుకుంటున్నారు. ప‌ర్ఫార్మెన్స్ ప‌రంగా, డాన్స్ ప‌రంగా సాయిప‌ల్ల‌వికి ఉన్న పేరుతో ఆమెతో మ్యాచ్ కావ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌నే ఉద్దేశంతో ర‌ష్మిక వెన‌క‌డుగు వేసింద‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.