English | Telugu

'పుష్ప' కోసం రెమ్యూన‌రేష‌న్ త‌గ్గించుకున్న బ‌న్నీ?

2020 సంక్రాంతికి విడుద‌లైన 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ సాధించాడు అల్లు అర్జున్‌. గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన‌ ఆ సినిమా ద్వారా రెమ్యూన‌రేష‌న్ కింద రూ. 25 కోట్లు అత‌నికి అందాయ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం అత‌ను సుకుమార్ డైరెక్ష‌న్‌లో పుష్ప మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకి మొద‌ట అత‌నికి మ‌రింత భారీ మొత్తం రెమ్యూన‌రేష‌న్‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేతలు ఆఫ‌ర్ చేశారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అనివార్యంగా బ‌డ్జెట్ త‌గ్గించుకోవాల్సిన అవ‌స‌రం క‌ల‌గ‌డంతో బ‌న్నీ సైతం త‌న రెమ్యూన‌రేష‌న్‌ను త‌గ్గించుకోడానికి ముందుకు వ‌చ్చాడ‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాలు చెబుతున్నాయి.

'అల వైకుంఠ‌పుర‌ములో' మూవీకి అందుకున్న దానితో పోలిస్తే 20 శాతం అద‌నంగా 'పుష్ప‌'కు అందుకోనున్నాడని తెలుస్తోంది. బ‌న్నీతో పాటు డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు సైతం త‌న రెమ్యూన‌రేషన్‌ను కొంత‌మేర‌కు త‌గ్గించుకున్నారు. ఓవ‌రాల్‌గా మొద‌ట అనుకున్న బ‌డ్జెట్‌తో పోలిస్తే రీషెడ్యూల్ చేసిన బ‌డ్జెట్ 60 శాత‌మే ఉంటుందంటున్నారు. బ‌న్నీ జోడీగా తొలిసారి ర‌ష్మికా మంద‌న్న న‌టిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఆగ‌స్ట్ నుంచి పూర్తి స్థాయిలో జ‌ర‌గ‌నున్న‌ది.