English | Telugu

రంగస్థలం రీషూట్..?

తన కొడుకును నలుగురు పొగడాలి.. అందరి చేతా శెభాష్ అనిపించుకోవాలని ఏ తండ్రికైనా ఉంటుంది. తమ కుమారుల కెరీర్‌ విషయంలో ఇలాగే ఆలోచించే తండ్రుల జాబితా టాలీవుడ్‌లోనూ ఉంది. అఖిల్ కోసం అక్కినేని నాగార్జున... రానా కోసం సురేష్ బాబు.. అల్లు అర్జున్ కోసం అల్లు అరవింద్ ఇలా ఎంతో తమ కొడుకుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసేందుకు ప్రతిక్షణం తపన పడుతున్నారు. ఇక రామ్‌చరణ్ సినిమా అంటే అందుకు కర్త, కర్మ, క్రియ అన్ని మెగాస్టార్ చిరంజీవే అన్నది ఓపెన్ సీక్రెట్. కథ ఎంపిక దగ్గరి నుంచి ఫైనల్ అవుట్‌పుట్ మొత్తం చిరు కనుసన్నల్లో జరగాల్సిందే. రీసెంట్‌గా సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ నటిస్తోన్న రంగస్థలం విషయంలోనూ ఇదే జరిగింది.

చిరంజీవి మొదట కథ విని పచ్చజెండా ఊపితేనే సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఆ తర్వాత పెద్దగా జోక్యం చేసుకోలేదు. అయితే రీసెంట్‌గా రంగస్థలం రషెస్ చూసిన మెగాస్టార్ కాస్త డీలా పడ్డారట. ఒకటి రెండు సీన్ల పట్ల అభ్యంతరం తెలిపి.. వాటిని రీషూట్ చేయాల్సిందిగా సుకుమార్‌కు సూచించాడట. ఎప్పుడు తండ్రి మాటకు అడ్డుచెప్పని చరణ్ ఈ సారి మాత్రం .. సుకుమార్ థింకింగ్ వేరు.. ఈ సినిమాని తన ఛాయిస్‌కే వదిలేద్దాం అంటూ చిరును కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడట. చరణ్ అంత పక్కగా చెప్పేసరికి చిరంజీవి కూడా కాదనలేకపోయారట. అయితే ఆయన మరోసారి ఫైనల్ రషెస్ చూస్తారని.. దీనిలో ఏమైనా తేడా అనిపిస్తే మాత్రం సుక్కు తప్పించుకోలేడని ఫిలింనగర్‌ టాక్.