English | Telugu

ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌పై ఆర్జీవీ క‌న్ను?

రామ్‌గోపాల్ వ‌ర్మ 'ప‌వ‌ర్ స్టార్' షార్ట్ ఫిలిమ్‌ను రిలీజ్ చేశాడు. క‌థ లేకుండా, ప‌వ‌ర్ స్టార్‌కు తాను హిత‌బోధ చేస్తున్న‌ట్లుగా చిత్రీక‌రించిన ఈ సినిమా కాని సినిమాని కాంట్ర‌వ‌ర్సీ ప‌బ్లిసిటీతో ఎప్ప‌టిలాగే సొమ్ము చేసుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీని ఆయ‌న ఆ సినిమాతో వ‌దిలిపెట్టేట్లు క‌నిపించ‌డం లేదు. దివంగ‌త న‌టుడు ఉద‌య్ కిర‌ణ్ బ‌యోపిక్‌ను ఆయ‌న తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు గ‌ట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్‌లో అడుగు పెట్టీ పెట్ట‌డంతోటే సంచ‌ల‌నం సృష్టించి, అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారిన ఉద‌య్‌.. 2014లో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉదంతం తెలుగునాట ఎంత క‌ల‌క‌లం క‌లిగించిందో మ‌న‌కు తెలుసు.

లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 'హృద‌య్ కిర‌ణ్' పేరుతో ఉద‌య్ బ‌యోపిక్‌ను ఆర్జీవీ తీయ‌నున్నాడు. ఉద‌య్ జీవితానికీ, మెగా ఫ్యామిలీకి ఉన్న క‌నెక్ష‌న్ ఈ మూవీలో ప్రాధాన్యం వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం. అంటే ఈ సినిమాతో ఆర్జీవీ మ‌రింత కాంట్ర‌వ‌ర్సీ, మరింత సెన్సేష‌న్ సృష్టించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల వ‌ర్మ తీస్తున్న సినిమాల‌న్నీ 20 నిమిషాల నుంచి 40 నిమిషాల నిడివితోనే ఉంటున్నాయి. అయితే ఈ మూవీ నిడివి మాత్రం కొంత ఎక్కువ ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. అతి త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఆర్జీవీ నుంచి రావ‌చ్చు.