English | Telugu

బిగ్ బాస్ 4 హోస్ట్‌గా నాగ్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా?

కెరీర్ ప‌రంగా కొంత కాలంగా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న అక్కినేని నాగార్జున త‌న‌కు కలిసొచ్చిన టీవీ తెర‌పై మ‌రోసారి క‌నిపించేందుకు రెడీ అవుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 3 మునుప‌టి రెండు సీజ‌న్ల‌కు మించి బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంలో ఆయ‌న పాత్ర చాలానే ఉంది. అందుకు నాలుగో సీజ‌న్‌కు సైతం హోస్ట్‌గా ఉండేందుకు ఆయ‌న‌ను ఒప్పించారు ఆ షో నిర్వాహ‌కులు.

నిజానికి క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా బ‌య‌ట‌కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని నాగార్జున బిగ్ బాస్ 4 తెలుగుకు హోస్ట్‌గా ఉండేందుకు మొద‌ట నిరాక‌రించార‌నే రిపోర్టులు వ‌చ్చాయి. దాంతో స్టార్ మా యాజ‌మాన్యం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించి విఫ‌ల‌మైంది. మ‌రోసారి నాగార్జున‌ను సంప్ర‌దించార‌నీ, మునుప‌టి సీజ‌న్‌తో పోలిస్తే మ‌రింత భారీ మొత్తం ఆఫ‌ర్ చేయ‌డంతో ఆయ‌న అంగీక‌రించార‌నీ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కాక‌పోతే ఈసారి ఎపిసోడ్ల సంఖ్య త‌క్కువ కావ‌డంతో ఆ మేర‌కు నాగార్జున రెమ్యూన‌రేష‌న్ ఉండ‌నుంది. మూడో సీజ‌న్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు అందుకున్న దానికంటే ఈ సీజ‌న్‌కు రెట్టింపు మొత్తం ఆయ‌న అందుకోనున్నార‌నేది ఆ ప్ర‌చార సారాంశం. అప్పుడు ఒక్కో ఎపిసోడ్‌కు నాగ్ అందుకున్న రెమ్యూన‌రేష‌న్ రూ. 12 ల‌క్ష‌లు. దాన్ని బ‌ట్టి ఈ సీజ‌న్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు ఆయ‌న ఎంత అందుకోనున్నారో ఇమాజిన్ చేసుకోవ‌చ్చు.

ఇటీవ‌ల స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోతో త్వ‌ర‌లోనే బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 4 ప్ర‌సారం కానుండ‌టం త‌థ్య‌మ‌నే విష‌యం ధ్రువ‌ప‌డింది. ఇప్ప‌టికే అన్న‌పూర్ణ ఏడెక‌రాల స్టూడియోలో ఉన్న బిగ్ బాస్ 3 హౌస్ సెట్‌కు మార్పులు చేర్పులు చేసి కొత్త‌గా త‌యారుచేశారు. నందు, సునీత‌, వైవా హ‌ర్ష‌, హంసానందిని, తాగుబోతు ర‌మేశ్ లాంటి సెల‌బ్రిటీలు ఈ షోలో కంటెస్టెంట్లుగా క‌నిపించ‌నున్నార‌నే ప్ర‌చారంతో నాలుగో సీజ‌న్ కోసం వీక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.