English | Telugu

ద‌స‌రా రేస్ లోకి `రాధేశ్యామ్`?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులంతా ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న సినిమా `రాధేశ్యామ్`. రెండేళ్ళ‌కు పైగా నిర్మాణంలో ఉన్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూస్తామా అని డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వారి ఎదురుచూపుల‌కు త‌గ్గ‌ట్టే.. ఎట్ట‌కేల‌కు జూలై 30ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసింది `రాధేశ్యామ్` యూనిట్.

అయితే, ఒక‌వైపు క‌రోనా సెకండ్ వేవ్ విజృంభించ‌డం.. మ‌రోవైపు `రాధేశ్యామ్`కి సంబంధించి ప్యాచ్ వ‌ర్క్ మిగిలి ఉండ‌డం.. ఈ అంశాల దృష్ట్యా `రాధేశ్యామ్` వాయిదా ప‌డే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ద‌స‌రా బ‌రిలో `రాధేశ్యామ్` దిగే అవ‌కాశముంద‌ట‌. ఒక‌వేళ ప్ర‌స్తుతం ప్ర‌చారంలో ఉన్న‌ట్లే.. రాజ‌మౌళి రూపొందిస్తున్న మ‌ల్టిస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్` క‌నుక 2022కి వాయిదా ప‌డితే.. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ అయిన అక్టోబ‌ర్ 13న `రాధేశ్యామ్` విడుద‌ల కావొచ్చ‌ని వినిపిస్తోంది. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, `రాధేశ్యామ్`లో ప్ర‌భాస్ కి జంట‌గా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రామ్, బాలీవుడ్ న‌టి భాగ్య‌శ్రీ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ పిరియ‌డ్ రొమాంటిక్ సాగాని యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది.