English | Telugu

చిరుతో మ‌రోసారి ప్రభుదేవా?

నృత్య‌ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా.. ఇలా ప్ర‌తి విభాగంలోనూ త‌న‌దైన ముద్ర వేశాడు మ‌ల్టిటాలెంటెడ్ ప్ర‌భుదేవా. జాతీయ స్థాయిలో ఆయా విభాగాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కూడా. తెలుగులోనూ ఈ మూడు శాఖ‌ల్లో విజ‌యాలు చూశాడు. వాస్త‌వానికి ప్ర‌భుదేవా తొలిసారిగా మెగాఫోన్ ప‌ట్టింది కూడా.. తెలుగు చిత్రం `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` కోస‌మే. ఆపై యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో `పౌర్ణ‌మి` చేసిన ప్ర‌భు.. అనంత‌రం మెగాస్టార్ చిరంజీవితో `శంక‌ర్ దాదా జిందాబాద్` చేశాడు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

ఇదిలా ఉంటే.. 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం ప్ర‌భుదేవా మ‌రో తెలుగు సినిమాకి డైరెక్ట్ చేసే అవ‌కాశం అందిపుచ్చుకున్నాడ‌ట‌. ఈ ఛాన్స్ ఇస్తున్న‌ది మ‌రెవ‌రో కాదు.. స్వ‌యానా మెగాస్టార్. `శంక‌ర్ దాదా జిందాబాద్` స‌క్సెస్ కాక‌పోయినా.. మ‌రో రీమేక్ ని ప్ర‌భుదేవా చేతిలో పెడుతున్నార‌ట చిరు. 2022 ద్వితీయార్ధంలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం. ఈ లోపు త‌ను క‌మిట్ అయిన చిత్రాల‌ని
పూర్తిచేసే దిశ‌గా ప్ర‌ణాళిక ర‌చిస్తున్నార‌ట చిరు. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజ‌మెంత తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.