English | Telugu

'ట‌క్ జ‌గ‌దీష్' కూడా ఓటీటీకే ఫిక్స్‌?

నాని తొలిసారి విల‌న్‌గా న‌టించిన 'వి' మూవీ క‌రోనా ఫ‌స్ట్ వేవ్ ఎఫెక్టుకు డైరెక్టుగా ఓటీటీలో విడుద‌లైంది. దానివ‌ల్లే నిర్మాత దిల్ రాజు సేఫ్ అయ్యార‌ని వినిపించింది. అయితే నాని ఫ్యాన్స్ మాత్రం థియేట‌ర్ల‌లో కాకుండా 'వి'ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయారు. త‌మ అసంతృప్తిని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. అందుకే త‌న త‌ర్వాత సినిమా క‌చ్చితంగా థియేట‌ర్ల‌లోనే రిలీజ్ అవుతుంద‌ని నాని వారికి హామీ ఇచ్చాడు.

క‌ట్ చేస్తే.. నాని లేటెస్ట్ ఫిల్మ్ 'ట‌క్ జ‌గ‌దీష్' కూడా ఓటీటీ బాట ప‌డుతున్న‌ద‌నే విష‌యం ప్ర‌చారంలోకి వ‌చ్చింది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేశ్‌, నాజ‌ర్‌, డానియెల్ బాలాజీ, న‌రేశ్‌, రోహిణి, దేవ‌ద‌ర్శిని, తిరువీర్ లాంటి ప‌లువురు తార‌లు కూడా భాగ‌మ‌య్యారు.

2020 ఫిబ్ర‌వ‌రిలో 'ట‌క్ జ‌గ‌దీష్' షూటింగ్ మొద‌లైంది. కొవిడ్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌కు ఆటంకాలు ఏర్ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు 2020 డిసెంబ‌ర్‌లో లాస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఏప్రిల్ 16న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ కొవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుప‌డటంతో విడుద‌ల‌ను వాయిదా వేయ‌క త‌ప్ప‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. కానీ జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌ట్లేద‌నే విష‌యం గ‌త శుక్ర‌వారం రిలీజైన రెండు సినిమాలు 'తిమ్మ‌రుసు', 'ఇష్క్' క‌లెక్ష‌న్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. పైగా ఫైనాన్షియ‌ర్ల నుంచి ఒత్తిడి ఎక్కువ‌వుతుండ‌టం, అప్పు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో 'ట‌క్ జ‌గ‌దీష్‌'ను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు అమ్మేయ‌డ‌మే బెట‌ర‌నే నిర్ణ‌యానికి నిర్మాత‌లు వ‌చ్చార‌ని వినిపిస్తోంది.

వారి ప‌రిస్థితి తెలుసు కాబ‌ట్టి నాని కూడా వారిపై ఒత్తిడి తేవ‌ట్లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఏతావాతా 'ట‌క్ జ‌గ‌దీష్' కూడా థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటున్నారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే నాని ఫ్యాన్స్ ఎలా రియాక్ట‌వుతారో!