English | Telugu
రాజమౌళికి పోటీగా తీస్తాడట!
Updated : Sep 22, 2015
రాజమౌళి కలల సినిమా.. మహాభారతం. బాహుబలిని చూసే జనాలంతా ఆహా ఓహో అన్నారు.అయితే రాజమౌళి టార్గెట్ బాహుబలి కాదు. అది మహాభారతానికి ట్రైలర్ మాత్రమే. మహాభారతగాథని.. హాలీవుడ్ స్థాయిలో తీయాలని, అందులో బాలీవుడ్ స్టార్లను తీసుకోవాలని రాజమౌళి యోచిస్తున్నాడు.
అయితే.... ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో, ఇదే స్థాయిలో మహాభారతాన్ని తెరకెక్కించాలని మరో దర్శకుడు కూడా కలలు కంటున్నాడు. అతనెవరో కాదు, ప్రభుదేవా. డాన్స్ మాస్టర్‌గా, ఆ తరవాత కథానాయకుడిగా, ఇప్పుడు దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు ప్రభుదేవా. తనకీ మహాభారతాన్ని తెరకెక్కించాలన్న గోల్ ఉందట.
ఎప్పటికైనా.. హాలీవుడ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, భారతదేశం మొత్తం నివ్వెరపోయేలా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని అంటున్నాడు. రాజమౌళి, ప్రభుదేవా.. వీళ్లిద్దరి స్థాయి, శైలి పూర్తిగా వేరు. ఒకరితో ఒకరికి పోటీ కాకపోయినా.. వీరిలో ఎవరు ముందు ఈ ప్రాజెక్టు నెత్తిమీద పెట్టుకొని, సెట్స్‌పైకి తీసుకెళ్తారా అన్న ఆసక్తి నెలకొంది. ఏదేమైనా మహాభారత గాథని... హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలన్న వీళ్ల తపనకు వీరతాళ్లు వేసేద్దాం.