English | Telugu

ప‌వ‌న్ తాగుడుకి బానిస అయిపోయాడా?

తెలుగు సినిమా అంటే... అందులో తాగుబోతు సీన్లు రెండో మూడో కంప‌ల్స‌రీ. హీరో.. అత‌ని గ్యాంగ్ ఓ చోట కూర్చుని మందుతాగుతూ... బ్ర‌హ్మానందం లాంటి బ‌క‌రాతో ఆడుకోవ‌డం శ్రీ‌నువైట్ల కాలం నుంచీ చూస్తోందే. కొంత‌మంది అగ్ర హీరోలూ.. ఈ టైపు స‌న్నివేశాల‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అయితే ఈ విష‌యంలో ముదిరిపోయాడు. ఖుషీలో ముంద‌ుకొట్టి అలీతో చేసిన సీన్ ప‌వ‌న్ అభిమానులు మ‌ర్చిపోరు. ఆ త‌ర‌వాత గ‌బ్బ‌ర్ సింగ్‌లో ఏకంగా మందు బాబులు.. మేం మందుబాబులం అనే పాట పెట్టేశాడు. ఇప్పుడు కాట‌మ‌రాయుడులో అయితే ఆ మ‌త్తు పీక్స్‌కి చేరింది.

జివ్వు జివ్వు అంటూ ఈ సినిమాలోనూ ఓ మందు పాట ఇరికించారు. తాగండ్రా బాబూ... తాగ‌క‌పోతే చ‌చ్చిపోతారు అన్న‌ట్టు సాగిందా పాట‌. ఈ తీరు చూస్తుంటే.. ప‌వ‌న్ లిక్క‌ర్ బ్రాండ్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిపోయాడా అనిపిస్తోంది. నిజానికి ప‌వ‌న్‌కి మ‌ద్యం సేవించే అల‌వాటు ఏమాత్రం లేదు. కానీ.. సినిమాల్లో మాత్రం ఇలా వీర తాగుబోతుగా క‌నిపిస్తుంటాడు. హీరోలు మందు బాటిలు ప‌ట్టుకొని.. పాట‌లు పాడుకోవ‌డం మామూలే. కానీ ఓ స్థాయి హోదా వ‌చ్చిన‌ప్పుడు డిగ్నిటీ మెంటైన్ చేయాలి. ప్ర‌జ‌ల‌కు, అభిమానుల‌కు త‌ప్పుడు.. సంకేతాలు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాలి. పెద్ద హీరోలు, అందునా ప్ర‌జా జీవితంలోకి వ‌ద్దామ‌నుకొన్న‌వాళ్లు ఇలాంటి పాట‌ల్ని ప‌క్క‌న పెడితే బాగుంటుందేమో. కాస్త ఆలోచించు ప‌వ‌న్‌!