English | Telugu

ఎన్టీఆర్‌తో సినిమాకి డ‌బ్బుల్లేవ‌ట‌!

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బోలెడ‌న్ని ఫ్లాపు సినిమాలు తీశాడు క‌ల్యాణ్ రామ్‌. ఇప్పుడు ఆ బ్యాన‌ర్ ఆర్థికంగా న‌ష్టాల్లో ఉంది. కిక్ 2 డిజాస్ట‌ర్ నుంచి ఆ సంస్థ తేరుకోవ‌డానికి చాలా కాలం ప‌ట్టేట్టు ఉంది. అన్న‌య్య‌ని ఏదోలా ఆదుకొందామ‌ని ఎన్టీఆర్ కూడా డిసైడ‌య్యాడు. అందుకే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేయ‌డానికి ప‌చ్చ జెండా ఊపాడు. జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత ఎన్టీఆర్ క‌ల్యాణ్ రామ్ బ్యాన‌ర్‌లోనే ఓ సినిమా చేయాల్సివుంది. ద‌ర్శ‌కుడు ఫైనల్ అయితే.. ఈ సినిమాని ప‌ట్టాలెక్కించేస్తార‌నుకొన్నారంతా. అయితే.. నిర్మాత‌గా క‌ల్యాణ్ రామ్ సిద్దంగా లేడ‌ని టాక్‌. తాజాగా ఇజంతో క‌ల్యాణ్ రామ్ రూ.6 కోట్ల వ‌ర‌కూ న‌ష్ట‌పోయాడ‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఆసినిమా విడుద‌లై.. ఫ్లాప్ అయితే.. మ‌రింత న‌ష్టాన్ని భ‌రించాల్సి ఉంటుంది. ఈ ద‌శ‌లో ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డానికి భారీ బ‌డ్జెట్‌నీ స‌మ‌కూర్చుకోవాలి. అందుకే ఆర్థికంగా అంత భారం మోయ‌డం ఇష్టం లేక‌, నిర్మాత‌గా డ్రాప్ అవ్వాల‌ని భావిస్తున్నాడ‌ట క‌ల్యాణ్ రామ్‌. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్‌కీ చెప్పేశాడ‌ట‌. దాంతో ఎన్టీఆర్ త‌దుప‌రి సినిమా కోసం మ‌రో నిర్మాత‌ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వ‌చ్చింది. ఒక‌వేళ ఈ సినిమా ఎన్టీఆర్ బ్యాన‌ర్‌లోనే చేసినా, బ‌య‌టి నుంచి డ‌బ్బులు పెట్టేది మ‌రొక‌ర‌ని... క‌ల్యాణ్ రామ్ పేరుకు మాత్ర‌మే నిర్మాత అని తెలుస్తోంది. ఒక‌వేళ ఊహించ‌ని రీతిలో ఇజం సినిమా హిట్ట‌యి.. బ‌య్య‌ర్ల నుంచి రెవిన్యూ వెన‌క్కి వ‌స్తే త‌ప్ప‌... క‌ల్యాణ్ రామ్ గ‌ట్టెక్క‌డం కుద‌ర‌ని ప‌ని. సో.. ఎన్టీఆర్ కు మ‌రో నిర్మాత కావ‌ల్సిందే అన్న‌మాట‌.