English | Telugu
నిత్యకు వార్నింగ్ ఇచ్చిందెవరు?
Updated : Aug 16, 2016
నిత్యమీనన్ నటన గురించి, తెరపై నిత్య పండించే హావభావాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్య ఓ గొప్ప నటి. సావిత్రితో పోల్చలేకపోయినా.. కనీసం సౌందర్యతో అయినా కంపేర్ చేయగలం. అయితే... నిత్య గొప్పదనం అంతా తెరపైనేనని, సెట్లో దర్శక నిర్మాతలకు నిత్య చుక్కలు చూపిస్తుంటుందని ఆమె గురించి తెలిసినవాళ్లంతా అంటుంటారు. తెలుగునాట నిత్యకు అవకాశాలు తగ్గడానికి కారణం అదే. అయితే.. నిత్య మాత్రమే చేయదగిన పాత్రలు ఆమెను వెదుక్కొంటూ వెళ్తున్నాయి. నిత్య ఏం చేసినా.. ఓపిగ్గా భరిస్తున్నాయి. ఇటీవల నాగ్ అశ్విన్ `మహానటి` అనే ఓ స్క్రిప్టు రాసుకొన్నాడు. అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. కథానాయికగా నిత్యని ఎంచుకొన్నారు.ఈ చిత్రానికి మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాత. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు పరిశీలించాక... చివరికి నిత్య పేరు ఖరారు చేసుకొన్నారు. నిత్య కూడా ఈ సినిమాలో నటించడానికి ఉత్సాహం చూపిస్తోంది.
అయితే నిత్య సంగతి ముందే తెలుసుకొన్న అశ్వనీదత్... నిత్యకు ముందస్తు వార్నింగులు ఇచ్చారట. చెప్పిన సమయానికి షూటింగ్‌కి రావాలని, దర్శకుడి విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకూడదని గట్టిగా చెప్పార్ట. పబ్లిసిటీ విషయంలో సహకరించాలని, లేదంటే పారితోషికంలో కోత విధించడం ఖాయమని, వ్యవహారం మరీ శ్రుతిమించితే.. కెరీర్‌కే నష్టమని క్లాసు పీకారట. అశ్వనీదత్ గురించి నిత్యకు తెలియందేం కాదు. ఆయన చెప్పింది చేయగల సమర్థుడు. దాంతో పాటు సావిత్రి స్ర్కిప్టు నిత్యకు బాగా నచ్చడంతో ఈ కండీషన్లన్నింటికీ ఒప్పుకొందట. పెద్ద ప్రొడ్యూసర్ల మాటకు తిరుగుంటుందా ఏమిటి?? వాళ్లు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే.