English | Telugu

తేజ - నితిన్‌ల మ‌ధ్య హోరాహోరీ

నేను ప‌రిచయం చేసిన హీరోలెవ్వ‌రికీ నాపై విశ్వాసం లేద‌ని, ఇప్పుడు క‌నీసం ట‌చ్‌లో కూడా ఉండ‌డం లేద‌ని, వాళ్లంతా వేస్ట్ ఫెలోస్ అని షాకింగ్ కామెంట్ చేశాడు తేజ‌. ఆ జాబితాలో నితిన్ కూడా ఉన్నాడ‌ని చాలామంది అనుమానం. ఎందుకంటే తేజ ద‌ర్శ‌క‌త్వంలోనే నితిన్ హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. జ‌యంతో ఒక్క‌సారిగా ఫేమ్‌లోకి వ‌చ్చాడు. వీరిద్ద‌రి కాంబోలో ధైర్యం అనే మ‌రో సినిమా వ‌చ్చింది. ఆ సినిమాతో ఇద్ద‌రి మ‌ధ్యా విబేధాలొచ్చాయ‌ని టాలీవుడ్ టాక్‌.

ఆ సినిమా పూర్త‌య్యాక నితిన్ అండ్ కో మ‌ళ్లీ రీ ఎడిటింగ్ చేశార‌ని, త‌మ‌కిష్టం వ‌చ్చిన ట్టు సీన్ ఆర్డ‌ర్ మార్చుకొన్నార‌ని, దాంతో తేజ‌కు నితిన్‌పై కోపం వ‌చ్చింద‌ని చెప్పుకొన్నారు. ధైర్యం సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేద‌ని ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పేశాడు తేజ‌. ఆ సినిమా ప్లాప్ త‌ర‌వాత ఇద్ద‌రి మ‌ధ్య దూరం మ‌రింత పెరిగిపోయింది. అప్ప‌టి నుంచీ తేజ‌కి నితిన్ ట‌చ్‌లో లేడ‌ట‌.

తేజ కామెంట్ల‌పై మీ స్పంద‌న ఏంట‌ని నితిన్ ని అడిగితే... తేజ ఏ ఉద్దేశంతో ఆ కామెంట్లు చేశారో నాకు తెలీద‌ని లైట్ తీసుకొన్నాడు. తేజ‌తో అంత‌గా ట‌చ్‌లో లేన‌ని, అందుకే తాను ఆ విష‌యాల్ని ప‌ట్టించుకోన‌ని చెప్తున్నాడు నితిన్‌. తేజ మంచి క‌థ‌తో వ‌స్తే ఒప్పుకోవ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌ర‌మూ లేద‌ని, తానెప్పుడూ సిద్ధంగానే ఉంటాన‌ని సెల‌విచ్చాడు నితిన్‌.