English | Telugu
సూపర్ స్టార్‌తో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్?
Updated : Jul 6, 2021
తెలుగునాట సీనియర్ స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇక ఈ తరం అగ్ర కథానాయకుల విషయానికి వస్తే.. ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో జట్టుకట్టింది నయన్. కట్ చేస్తే.. త్వరలో సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి రెడీ అవుతోందట ఈ కేరళకుట్టి.
ఆ వివరాల్లోకి వెళితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో `అతడు`, `ఖలేజా` తరువాత మహేశ్ బాబు మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నాడు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాని 2022 వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ఇద్దరు నాయికలకు స్థానముండగా, మెయిన్ లీడ్ గా నయన్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అదే గనుక నిజమైతే.. అటు మహేశ్ బాబుతోనూ, ఇటు త్రివిక్రమ్ తోనూ నయన్ జట్టుకట్టే తొలి సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే `#SSMB 28`లో నయన్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, ప్రస్తుతం నయన్ చేతిలో `అణ్ణాత్తే`, `కాత్తువాక్కుల రెండు కాదల్` అనే తమిళ చిత్రాలున్నాయి. అలాగే `నేట్రిక్కన్` విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు చాలా కాలంగా విడుదలకు నోచుకుని నయన్ తెలుగు చిత్రం `ఆరడుగుల బుల్లెట్` ఆగస్టులో తెరపైకి రాబోతోంది.