English | Telugu

నానితో గౌత‌మ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్?

`మ‌ళ్ళీ రావా`(2017) చిత్రంతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసిన గౌత‌మ్ తిన్న‌నూరి.. త‌న ద్వితీయ ప్ర‌య‌త్నం `జెర్సీ` (2019)తో కెప్టెన్ గా ఎన‌లేని గుర్తింపుని పొందారు. నేచుర‌ల్ స్టార్ నానిని మిడిల్ ఏజ్డ్ క్రికెట‌ర్ గా చూపిస్తూ.. గౌత‌మ్ తెర‌కెక్కించిన `జెర్సీ` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు `బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్ ఇన్ తెలుగు`, `బెస్ట్ ఎడిటింగ్` విభాగాల్లో జాతీయ పుర‌స్కారాల‌ను సైతం పొందింది. కాగా, ఈ ఏడాది దీపావ‌ళికి `జెర్సీ` హిందీ వెర్ష‌న్ తో హ్యాట్రిక్ కి సిద్ధ‌మ‌వుతున్నారు గౌత‌మ్. షాహిద్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా న‌వంబ‌ర్ 5న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

ఇదిలా ఉంటే.. గౌత‌మ్ త‌న నాల్గ‌వ సినిమాని నానితో చేయ‌బోతున్నార‌ని గ‌త‌కొంత‌కాలంగా ప్ర‌చారం సాగుతోంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన ఓ సైనికుడి జీవిత చరిత్ర‌గా ఈ సినిమా రూపొంద‌నుంద‌ట‌. అంతేకాదు.. పాన్ - ఇండియా ప్రాజెక్ట్ లా ఈ బయోపిక్ తర‌హా వెంచ‌ర్ తెర‌కెక్క‌నుంద‌ని వినికిడి. త్వ‌ర‌లోనే నాని - గౌత‌మ్ సెకండ్ జాయింట్ ఫ్లిక్ పై క్లారిటీ రానుంది.

కాగా, ప్ర‌స్తుతం నాని చేతిలో `టక్ జ‌గ‌దీష్`, `శ్యామ్ సింగ రాయ్`, `అంటే.. సుంద‌రానికీ!` చిత్రాలున్నాయి.