English | Telugu

చిరుకి షాక్ ఇచ్చిన రేటింగులు

తొమ్మిదేళ్ల త‌ర‌వాత చిరంజీవి రీ ఎంట్రి ఇచ్చిన చిత్రం ఖైదీ నెం.150. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన చిరు సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర సూప‌ర్ డూప‌ర్ హిట్ అయి... సంక్రాంతి విజేతగా నిలిచింది. దాదాపుగా 150 కోట్ల వ‌సూళ్ల‌తో ట్రేడ్ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. అలా.. టాలీవుడ్‌లో చిరు రీ ఎంట్రీ సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఓవ‌ర్సీస్‌లోనూ చిరు సినిమాకి మంచి వ‌సూళ్లు ద‌క్కాయి. అన్ని చోట్లా... ఖైదీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అయితే... ఓ చోట మాత్రం చిరు సినిమా నిరాశ‌ప‌రిచింది. అదే... బుల్లి తెర‌పై. ఇటీవ‌ల మా టీవీలో ఖైదీ నెం.150ని ప్ర‌సారం చేశారు.

తొలిసారి టీవీలో వ‌స్తోంది కాబ‌ట్టి... టీఆర్‌పీ రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయం అనుకొన్నారంతా. మా టీవీ కూడా అదే స్థాయిలో ప్ర‌చారం చేసింది. అయితే ఈ సినిమాకి టీవీలో 6.9 రేటింగ్ మాత్ర‌మే వ‌చ్చింది. ఓ విధంగా... ఈ రేటింగ్ ఎవ్వరూ ఊహించ‌లేదు. అత్తారింటికి దారేది, మిర్చి, శ్రీ‌మంతుడులాంటి సినిమాల‌కు ఎప్పుడు టీవీలో ప్ర‌సారం అయినా దాదాపు 10 టీఆర్‌పీని అందుకొంటాయి. అలాంటిది చిరు సినిమా తొలిసారి ప్ర‌సారం అయిన‌ప్పుడు 6.9 టీఆర్‌పీ రేటింగ్ తో స‌రిపెట్టుకోవ‌డం మెగా అభిమానుల్ని నిరాశ ప‌రిచింది. కొన్ని సినిమాలంతే... థియేట‌ర్లో తెగ ఆడేస్తాయి. టీవీలో చ‌తికిల‌ప‌డ‌తాయి. ఆ లిస్టులో ఖైదీ కూడా చేరిపోయిన‌ట్టే.