English | Telugu

'ఫైట‌ర్' మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ కాదా?

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ 'ఫైట‌ర్ అనే మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ అండ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామి కావ‌డంతో, దీనికి పాన్ ఇండియా లుక్ వ‌చ్చేసింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో ఈ మూవీని తీస్తున్నారు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2' ఫేమ్ అన‌న్యా పాండే ఈ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెడుతోంది. క‌ర‌ణ్ జోహార్ ఎంట్రీ త‌ర్వాత సినిమాకు సంబంధించి ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా అత‌డిని సంప్ర‌దించాల్సిన అవ‌స‌రం క‌లుగుతోంది పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి జోడీకి. చార్మి ఈ సినిమాని పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే.

తాజాగా ఆన్‌లైన్‌లో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం ఫైట‌ర్ మ్యూజిక్ డైరెక్ష‌న్‌కు సంబంధించి క‌ర‌ణ్ జోహార్ తీసుకున్న నిర్ణ‌యానికి పూరి ఓకే అన‌క త‌ప్ప‌లేదు. వాస్త‌వానికి 'ఇస్మార్ట్ శంక‌ర్‌'కు బ్లాక్‌బ‌స్ట‌ర్ మ్యూజిక్ ఇచ్చిన సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ చేతే ఈ సినిమాకీ ట్యూన్స్ క‌ట్టించాల‌ని పూరి అనుకున్నాడు. కానీ బాలీవుడ్‌కు చెందిన మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను తీసుకుంటే బాగుంటుంద‌నీ, హిందీ వెర్ష‌న్‌కు అది ప్ల‌స్ అవుతుంద‌నీ క‌ర‌ణ్ జోహార్ చెప్ప‌డంతో పూరి స‌రేన‌న‌క త‌ప్ప‌లేదంటున్నారు. అయితే ఎవ‌రిని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకున్నార‌నేది ఇంకా వెల్ల‌డి కాలేదు.

'ఫైట‌ర్‌'కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ ముంబైలో 40 శాతం షూటింగ్ జ‌రిగింది. తొలిసారి ఈ మూవీ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ సిక్స్ ప్యాక్ బాడీతో క‌నిపించ‌నున్నాడు. ఇందులో అత‌ను ఒక బాక్స‌ర్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా అత‌డిని యాక్ష‌న్ స్టార్‌గా మారుస్తుంద‌నీ, మాస్‌లోనూ ఇమేజ్ పెంచుతుంద‌నీ 'ఫైట‌ర్' బృందం అంటోంది.