English | Telugu

మహేశ్, పవన్‌లు కూడా "ఆమె"ను కాపాడలేకపోయారు..?

ఎంతో కష్టపడి తీసిన సినిమాను ప్రమోషన్ చేసుకోవడంలోనే విజయం ఆధారపడి ఉంటుందన్నది సినీజనాల మాట. కంటెంట్ ఎంత బాగున్నా ప్రమోషన్ లేకపోతే అది జనాల దాకా వెళ్లక ఫ్లాపైన ఉదాహరణలు ఎన్నో.. అయితే ప్రమోషన్ బాగున్నా.. కథలో దమ్ము లేకపోతే జనాలు పక్కనపెట్టేయం కూడా చూశాం. ఇప్పుడు ఘట్టమనేని మంజుల తీసిన మనసుకు నచ్చింది రెండో కోవలోకి వస్తుందంటున్నారు క్రిటిక్స్. తొలిసారి మెగాఫోన్ పట్టడంతో.. తన సినిమాకు జనాల్ని రప్పించడానికి ఆమె చేయగలిగిందంతా చేసింది. తమ్ముడు మహేశ్‌తో వాయిస్ ఓవర్ చెప్పించడంతో పాటు ప్రమోషన్‌లో కూడా సూపర్‌స్టార్‌ను వాడుకుంది. అక్కడితో ఆగకుండా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ని మెప్పించడం కోసం ఆయన ప్రస్తావన తీసుకువచ్చింది.

ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కోసం తాను ఒక కథ రాసుకున్నానని.. కల్యాణ్ అయితేనే దానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని చెప్పింది. పవన్-మహేశ్ మంచి ఫ్రెండ్సని.. అర్జున్ సినిమా పైరసీ విషయంలో పవర్‌స్టార్ ఎంతో హెల్ప్ చేశారని ఓ రేంజ్‌లో మోసేసింది. మంజుల ఈ రేంజ్‌లో భజన చేయడానికి కారణం లేకపోలేదు.. పవన్, మహేశ్‌ అభిమానులు తన సినిమాను సూపర్‌హిట్ చేస్తారని ఆమె ప్లాన్ కాబోలు. తీరా సినిమా రిలీజైంది.. మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో.. డిజాస్టర్‌గా నిలిచింది. ఇక్కడ తేలింది ఎంటంటే.. కంటెంట్‌లో విషయం లేకపోతే.. ఎంతపెద్ద సూపర్‌స్టార్లు అండగా నిలబడినా ప్రేక్షకులు పక్కనపెట్టేస్తారు.