English | Telugu
'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు!
Updated : Feb 19, 2022
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 25 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మహేష్ బాబు రానున్నాడని ప్రచారం జరుగుతోంది.
'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 21 న నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మొదట ఈ ఈవెంట్ ని వేరే ఏ ఇతర స్టార్స్ ని గెస్ట్ లుగా పిలవకుండా చేయాలనుకున్నారట. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ సూచనతో మహేష్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. పవన్, మహేష్ ఇద్దరితోనూ త్రివిక్రమ్ సన్నిహితంగా ఉంటాడు. 'భీమ్లా నాయక్'కి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్.. డైరెక్టర్ గా తన తదుపరి సినిమాని మహేష్ తో చేస్తున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. 'జులాయి' సినిమా తర్వాత నుంచి త్రివిక్రమ్ ఇతర బ్యానర్స్ లో సినిమాలు చెయ్యట్లేదు. అనుబంధ సంస్థలైన హారిక & హాసిని, సితారలో త్రివిక్రమ్ మాటకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆయన సూచనతోనే తమ తదుపరి హీరో అయిన మహేష్ ని భీమ్లా నాయక్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'జల్సా' సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పవన్, త్రివిక్రమ్ తో ఉన్న సాన్నిహిత్యంతో మహేష్ కూడా ఈ ఈవెంట్ కి రావడానికి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.
'భీమ్లా నాయక్'లో పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు.