English | Telugu

మరోసారి అక్కినేని హీరోతో బుట్టబొమ్మ!

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన పూజా హెగ్డే.. స్టార్ హీరోయిన్ గా ఎదిగి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ బుట్టబొమ్మ చేతిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ అమ్మడు తన మొదటి హీరో చైతన్యతో మరోసారి ఆడిపాడనుందని తెలుస్తోంది.

ఇటీవల 'మానాడు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పూజా పేరు వినిపిస్తోంది. ఈ ద్విభాషా చిత్రంలో హీరోయిన్ పాత్ర కీలకమట. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా, తమిళ్ లోనూ విజయ్ సరసన 'బీస్ట్'లో నటించి సత్తా చాటడానికి సిద్ధమైంది. అందుకే ఈ మూవీలో హీరోయిన్ గా పూజాను ఎంపిక చేశారని, ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ కు ఒకే చెప్పిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల మరో అక్కినేని హీరో అఖిల్ మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' తో పూజా సక్సెస్ అందుకుంది.

కాగా, పూజా వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. ప్రభాస్ సరసన ఆమె నటించిన 'రాధేశ్యామ్' మార్చి 11 న విడుదల కానుంది. ఆమె హీరోయిన్ గా నటించిన బీస్ట్ ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది. అలాగే ఆమె కీలక పాత్ర పోషించిన మెగాస్టార్ 'ఆచార్య' ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.