English | Telugu

నాని 'ద‌స‌రా' కోసం కీర్తి ఎంత తీసుకుంటోందో తెలిస్తే.. స‌ర్‌ప్రైజ్ అవ్వాల్సిందే!

'మ‌హాన‌టి' మూవీతో కీర్తి సురేశ్ కీర్తి ప్ర‌తిష్ఠ‌లు దేశ‌వ్యాప్త‌మ‌య్యాయి. ఉత్త‌మ‌న‌టిగా నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్న ఆమె, ఆ త‌ర్వాత కొన్ని విమ‌న్ సెంట్రిక్ మూవీస్ చేసింది కానీ, అవి పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అవ‌లేదు. దాంతో ప్రాజెక్టుల సెల‌క్ష‌న్‌ను మార్చేసింది. క్రేజీ ప్రాజెక్టుల్లో భాగం కావ‌డం మీద ఎక్కువ ఫోక‌స్ పెడుతోంది. ఇటీవ‌ల ఆమె న‌టించిన సినిమాలు ఫ్లాపైనా, కెరీర్ మీద వాటి ప్ర‌భావ‌మేమీ ప‌డ‌క‌పోవ‌డం విశేషం. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే, న‌టిగా ఆమెకు ఎంత డిమాండ్ ఉందో అర్థ‌మ‌వుతుంది.

'స‌ర్కారు వారి పాట‌'లో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ జోడీగా న‌టిస్తోన్న ఆమె, 'అణ్ణాత్త‌'లో ర‌జ‌నీకాంత్ సిస్ట‌ర్‌గా, 'భోళాశంక‌ర్‌'లో చిరంజీవి సిస్ట‌ర్‌గా న‌టిస్తోంది. లేటెస్ట్‌గా 'ద‌స‌రా' మూవీలో నాని స‌ర‌స‌న నాయిక‌గా ఎంపికైంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ. 3 కోట్ల‌ను అందుకుంటోంద‌ని ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్‌లో హారోయిన్ల రెమ్యూన‌రేష‌న్ చెప్పుకోద‌గ్గ స్థాయిలో పెరిగింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. నిన్నటి దాకా హీరోయిన్ల‌కు రూ. కోటి రెమ్యూన‌రేష‌న్ అంటేనే ఎక్కువ అనుకునేవాళ్లు. ఇప్పుడు రెండు కోట్లు కూడా దాటిన హీరోయిన్లు టాలీవుడ్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం కీర్తికి ఉన్న డిమాండ్ రీత్యా 3 కోట్ల రెమ్యూన‌రేష‌న్ అనేది స‌మంజ‌స‌మేన‌ని అంటున్నారు. అయితే 'ద‌స‌రా'లో న‌టించ‌డానికి కీర్తికి అంత ఇస్తున్నారా, లేదా అనే విష‌యం క‌న్ఫామ్ కాలేదు.

నానితో జ‌త క‌ట్ట‌డం కీర్తికి ఇదే ఫ‌స్ట్ టైమ్ కాదు. ఇదివ‌ర‌కు ఆ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన 'నేను లోక‌ల్' సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్ అయింది. ఇప్పుడు 'ద‌స‌రా'లో మ‌రోసారి ఆ ఇద్ద‌రూ పెయిర్‌గా న‌టిస్తుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఈ మూవీ ద్వారా శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.