English | Telugu

పెప్సీ యాడ్ చేసినందుకు ప‌వ‌న్ పాప‌ప‌రిహారం!

ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ల‌కు దూరం అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ప‌వ‌న్ లాంటి స్టార్ డ‌మ్ ఉన్న హీరో యాడ్లు చేస్తే కోట్ల‌కు కోట్లు వ‌చ్చిప‌డిపోతాయి. కానీ.. తాను వాడ‌ని వ‌స్తువు గురించి ప్ర‌చారం చేయ‌డం ప‌వ‌న్‌కి ఏమాత్రం ఇష్టం ఉండ‌దు. అందుకే కోట్లు సైతం వ‌దులుకొన్నాడు. అయితే.. కెరీర్‌ తొలి నాళ్ల‌లో పెప్సీ యాడ్‌లో మాత్రం ప‌వ‌న్ క‌నిపించాడు. అయితే.. ఆ యాడ్ చేయ‌డం కూడా ప‌వ‌న్‌కి ఇష్టం లేద‌ట‌.

ఆ యాడ్ ఒప్పుకొని త‌ప్పు చేశాన‌ని అందుకోసం పాప ప‌రిహారం కూడా చేసుకొన్నాన‌ని ప‌వ‌న్ ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. నిజానికి పెప్పీలాంటి శీత‌ల పానియాలు ప‌వ‌న్ ముట్టుకోడ‌ట‌. నేను తాగంది.. మిగిలిన వాళ్లు ఎందుకు తాగాలి?? అనుకొని బ‌ల‌వంతంగా ఆ అగ్రిమెంట్‌ని పూర్తి చేశాడ‌ట‌. ఆ పాపాన్ని క‌డుక్కోవ‌డానికే... ఆ త‌ర‌వాత మొక్క‌ల్ని పెంచ‌డం అల‌వాటు చేసుకొన్నాడ‌ట ప‌వ‌న్‌. అప్ప‌టి నుంచి ప‌వ‌న్‌.. యాడ్ల జోలికి వెళ్లలేదు. కోట్లు ఇస్తే చాలు.. ఎలాంటి యాడ్‌లు చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డిపోయే స్టార్లు.. ప‌వ‌న్‌ని చూసి చాలా నేర్చుకోవాలి.