English | Telugu

‘ఆచార్య’ నుండి కాజల్‌ అవుట్‌?

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆచార్య’. నవంబర్‌ 9 నుండి మళ్ళీ రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నట్టు ప్రొడక్షన్‌ హౌస్‌లు కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ రోజు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాయి. అయితే, ఈ సందర్భంగా చేసిన ట్వీట్‌లో హీరో నుంచి మొదలు పెడితే... డైరెక్టర్‌, కెమెరామెన్‌ తిరు, ఎడిటర్‌ నవీన్‌ నూలి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మతో పాటు నిర్మాతలు రామ్‌చరణ్‌, నిరంజన్‌రెడ్డి పేర్లను కొణిదెల ప్రొడక్షణ్‌ కంపెనీ ట్యాగ్‌ చేసింది. కానీ, హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ని మాత్రం ట్యాగ్‌ చేయలేదు.

‘ఆచార్య’లో చిరంజీవి సరసన కథానాయికగా ముందు త్రిషను ఎంపిక చేశారు. కొన్ని కారణాల వలన ఆమె సినిమా నుండి వైదొలగింది. తర్వాత ఆ అవకాశం కాజల్‌ అగర్వాల్‌ దగ్గరకు వెళ్ళింది. చిరుతో ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత మరోసారి నటిస్తున్నట్టు కాజల్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ప్రొడక్షన్‌ హౌస్‌ ట్వీట్‌లో ఆమె పేరు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. ‘ఆచార్య’ నుండి కాజల్‌ అవుట్‌ అయ్యిందా? అనే అనుమానాలను కొందరు అభిమానులు వ్యక్తం చేశారు. అయితే, అటువంటిది ఏమీ లేదని సమాచారం అందుతోంది.

అసలు, ‘ఆచార్య’లో కాజల్‌ నటిస్తున్నట్టు ఇప్పటివరకూ అఫీషియల్‌గా ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి ప్రకటన రాలేదు. మాంచి ముహూర్తం చూసుకుని అనౌన్స్‌ చేయడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ వంటిది రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. అప్పటివరకూ కాజల్‌ నటిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించే అవకాశాలు లేవు.