English | Telugu

మళ్ళీ కలుస్తున్న చైతన్య, సమంత!

నాగ చైతన్య, సమంత మళ్ళీ కలవబోతున్నారంటూ ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. అయితే వాళ్ళు కలవబోయేది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లోనట. వీరిద్దరిని కలపడం కోసం దర్శకురాలు నందిని రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలుగువారిని విశేషంగా అల‌రించిన వెండితెర జంట‌ల్లో చైత‌న్య‌, స‌మంత జోడీ ఒక‌టి. చైతన్య హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ 'ఏమాయ చేసావె' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది సమంత. అలాగే 'మ‌నం' వంటి మెమ‌ర‌బుల్ హిట్ అందుకున్న ఈ పెయిర్.. పెళ్లి తర్వాత తొలిసారి క‌లిసి న‌టించిన సినిమా 'మ‌జిలీ'. విడాకుల‌కు ముందు జోడీగా న‌టించిన ఆఖ‌రి చిత్రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఒక సినిమా కోసం ఈ జోడీని మళ్ళీ కలపడానికి నందిని రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 'అన్నీ మంచి శ‌కున‌ములే' సినిమాతో బిజీగా ఉన్న నందిని.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని చైతన్యతో చేయడానికి ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే చైతన్యకు కథ వినిపించగా, బాగా నచ్చడంతో అతను వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర కీలకమని, దానికి సమంత బెస్ట్ ఛాయిస్ అని నందిని భావిస్తోందట. అందుకే చైతన్య, సమంతను ఒప్పించి జోడీగా నటింపజేయాలని ఆమె గట్టిగానే ట్రై చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నందిని రెడ్డితో సమంతకి మంచి అనుబంధం ఉంది. 2013 లో వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'జబర్దస్త్' నిరాశపరిచినప్పటికీ ఆ సమయంలో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత 2019 లో వచ్చిన 'ఓ బేబీ' మంచి విజయాన్ని అందుకుంది. అందులో చైతన్య స్పెషల్ రోల్ లో మెరవడం విశేషం.

విడాకుల తీసుకొని ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్న చైతన్య, సమంతను తన సినిమా కోసం కలపాలి అనుకుంటున్న నందిని ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.