English | Telugu
మహేశ్ కండిషన్స్‌తో త్రివిక్రమ్-రాధాకృష్ణ అప్సెట్ అయ్యారా?!
Updated : Jul 13, 2021
సూపర్‌స్టార్ మహేశ్ తన లేటెస్ట్ ఫిల్మ్ 'సర్కారువారి పాట' షూటింగ్‌ను సోమవారం పునరుద్ధరించాడు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, బిజినెస్ పార్టనర్‌గా మహేశ్‌కు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవహరిస్తోంది.
'సర్కారువారి పాట' తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మూడో సినిమా చేయాలని మహేశ్ డిసైడయ్యాడు. దీన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు. మహేశ్ లాంటి సూపర్‌స్టార్, త్రివిక్రమ్ సూపర్ డైరెక్టర్ కాంబినేషన్ అవడంతో సహజంగానే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణమవుతుందని ఎవరైనా ఇట్టే గ్రహిస్తారు. త్రివిక్రమ్ మునుపటి సినిమా 'అల.. వైకుంఠపురములో'కి మించి, మరింత ఎక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా తియ్యడానికి ప్రొడ్యూసర్ రెడీ అవుతున్నారు.
మహేశ్ ఒక సినిమా మొదలుపెట్టాడంటే, అతనికి సంబంధించి అన్ని విషయాలూ పక్కాగా ఉన్నాయని అర్థం. స్క్రిప్టుకు ఎంత ప్రాముఖ్యం ఇస్తాడో, రెమ్యూనరేషన్ విషయానికీ అంత ప్రాముఖ్యం ఇస్తాడు మహేశ్. ఇవి త్రివిక్రమ్‌కు బాగా తెలుసు. అందుకే తన ప్రొడ్యూసర్‌ను ఇప్పటికే దీనిపై అప్రమత్తం చేశాడు. నిర్మాత రాధాకృష్ణ కూడా దానికి ప్రిపేర్ అయ్యారు. అయితే చాలామంది నిర్మాతల్లాగా కేవలం పెట్టుబడి పెట్టే వ్యాపారవేత్తగానే కాకుండా, సినిమాకు సంబంధించిన పలు విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. మహేశ్‌కు కూడా రాధాకృష్ణ వ్యవహారశైలి బాగా నచ్చిందని ఇన్‌సైడర్స్ టాక్.
కాగా ప్రస్తుతం దీనికి భిన్నమైన రూమర్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. తన సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది నిర్మాత కాకుండా మహేశ్ డిసైడ్ చేస్తాడనీ, ఇదే కండిషన్‌ను రాధాకృష్ణకు కూడా ఆయన చెప్పాడనీ, దీంతో ఆయన, త్రివిక్రమ్ ఇద్దరూ అప్‌సెట్ అయ్యారనేది, ఆ రూమర్ సారాంశం. అంతేకాదు, మొదట రెమ్యూనరేషన్‌కు ఒప్పుకొని, ఇప్పుడు బిజినెస్ పార్టనర్‌గా ఉంటానని మహేశ్ చెప్పాడని కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే మహేశ్‌తో రాధాకృష్ణకు ఎలాంటి సమస్యా రాలేదనీ, ఈ రూమర్స్‌కు అతీతంగా ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.