English | Telugu

ర‌వితేజ కోసం ఇలియానా ప్ర‌త్యేక గీతం?

మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న ఎక్కువ చిత్రాల్లో న‌టించిన క‌థానాయిక‌గా గోవా సుంద‌రి ఇలియానాకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. `ఖ‌త‌ర్నాక్`, `కిక్`, `దేవుడు చేసిన మ‌నుషులు`, `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని`.. ఇలా నాలుగు చిత్రాల్లో ర‌వితేజ - ఇలియానా జంట‌గా న‌టించారు. వీటిలో `కిక్` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించ‌గా.. మిగిలిన మూడు సినిమాలు ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

ఇదిలా ఉంటే.. `దేవుడు చేసిన మ‌నుషులు` త‌రువాత హిందీ చిత్రాల‌వైపే దృష్టి పెట్టిన ఇలియానా.. ఆరేళ్ళ త‌రువాత ర‌వితేజ న‌టించిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని` సినిమాతోనే తెలుగునాట రి-ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత మ‌ళ్ళీ టాలీవుడ్ వైపు చూడ‌ని ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లో మ‌రోసారి ర‌వితేజతో జ‌ట్టుక‌ట్ట‌నుంద‌ట‌. కాకపోతే, ఈ సారి నాయిక‌గా కాదు.. ఓ ప్ర‌త్యేక గీతం కోసం ర‌వితేజ స‌ర‌స‌న ఆడిపాడ‌నుంద‌ట ఇలియానా.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `రామారావు ఆన్ డ్యూటీ` పేరుతో ర‌వితేజ ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో `మ‌జిలీ` ఫేమ్ దివ్యాంశ కౌశిక్, `క‌ర్ణ‌న్` ఫేమ్ ర‌జీషా విజ‌య‌న్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. కాగా, ఇందులో క‌థానుసారం వ‌చ్చే ఓ స్పెష‌ల్ సాంగ్ లో ఇలియానా మెరుస్తుంద‌ట‌. ర‌వితేజ‌తో త‌న‌కున్న స్నేహం కార‌ణంగానే కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ ఈ స్పెష‌ల్ డ్యాన్స్ నంబ‌ర్ చేయ‌నుంద‌ట ఇలియానా. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.