English | Telugu

హలో సేఫ్.. నాగ్‌ ఊపిరి పీల్చుకున్నట్లేనా..?

ఏ తండ్రికైనా తన కొడుకుల్ని ప్రయోజకులుగా చేయాలని ఉంటుంది. అందుకోసం ఆ తండ్రి పడే తపన అంతా ఇంతా కాదు. ఇప్పుడు కింగ్ నాగార్జున అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. తన ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు నాగచైతన్య .. తాత, తండ్రుల బాటలో రోమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని కెరీర్‌లో స్థిరపడ్డాడు. రీసెంట్‌గానే ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేసి చైతూని ఒక ఇంటి వాడిని చేశాడు నాగ్. ఇక నాగచైతన్య గురించి నాగార్జునకు ఎలాంటి బాధ లేదు. కానీ రెండో కొడుకు అఖిల్ కెరీర్‌ నాగ్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అఖిల్ ఫస్ట్ మూవీ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఆ తర్వాత శ్రేయాభూపాల్‌తో జరిగిన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవ్వడంతో అఖిల్ గురించి బెంగ పెట్టుకున్నాడు కింగ్.

ముందు కొడుకు కెరీర్‌పై ఫోకస్ పెట్టిన నాగ్... అతని రెండో సినిమా కోసం ఆచితూచి అడుగులు వేశాడు. ఎన్నో కథలను విని.. చివరకు తనకు, తన ఫ్యామిలీకి "మనం" లాంటి మెమురబుల్ హిట్ అందించిన విక్రమ్ కుమార్‌‌ చేతుల్లో అఖిల్‌ను పెట్టాడు. నాగార్జునతో పాటు మొత్తం టాలీవుడ్ ఆశలన్నీ విక్రమ్ పైనే. అందుకు తగ్గట్టుగానే తనమార్క్ స్క్రీన్‌ప్లే, గ్రాండ్ పిక్చరైజేషన్‌తో హలోపై క్యూరియాసిటీ పెంచాడు విక్రమ్.

ఇవాళ ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా అంటే.. అవుననే అంటున్నారు సినీజనాలు. హలో చూసిన వాళ్లంతా పర్లేదు కుర్రాడు బాగానే కష్టపడ్డాడు.. సినిమా బాగుంది అంటూ ప్రశంసిస్తున్నారు. తొలి సినిమాతో పోలిస్తే.. ఇందులో అఖిల్ నటనలో చాలా మెచ్యురిటి కనిపించిందట. ఎక్కడా ఎనర్జీ లెవల్స్ డ్రాప్ కాకుండా.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెటిల్డ్‌గా.. హుషారుగా కనిపించాడట అఖిల్. సన్నిహితులతో పాటు అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్న నాగ్.. సినిమా టాక్‌ను తెలుసుకుని ఎంజాయ్ చేస్తున్నాడట. నిర్మాతగా కాకుండా ఒక తండ్రిగా ఆయన హలో కోసం ఎంత కష్టపడ్డాడో ప్రేక్షకులు చూస్తునే ఉన్నారు. సో.. ఆయనకు ఇంతకన్నా ఆనందం ఏముంది చెప్పండి.