English | Telugu
చిరు చిత్రంలో చియాన్ విక్రమ్?
Updated : Aug 20, 2021
చియాన్ విక్రమ్ పేరు చెప్పగానే తమిళ అనువాద చిత్రాలు `శివపుత్రుడు`, `అపరిచితుడు` కళ్ళముందు కదలాడతాయి. అయితే, వాటికంటే ముందే విక్రమ్ కొన్ని తెలుగు సినిమాలు చేశాడు. `బంగారు కుటుంబం`, `ఊహా`, `ఆడాళ్ళా మజాకా`, `అక్కా బాగున్నావా`, `మెరుపు`, `కుర్రాళ్ళ రాజ్యం`, `9 నెలలు`.. ఇలా అరడజనుకి పైగా తెలుగు చిత్రాల్లో సందడి చేశాడు విక్రమ్. కట్ చేస్తే.. దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఓ స్ట్రయిట్ తెలుగు పిక్చర్ లో నటించడానికి విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా `హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన రాజా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసిఫర్`కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట. మాతృకలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో విక్రమ్ దర్శనమిస్తాడని బజ్. వాస్తవానికి ఈ రోల్ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కనిపిస్తాడని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. అయితే, సల్మాన్ నో చెప్పడంతో విక్రమ్ ని అప్రోచ్ అయ్యాడట దర్శకుడు మోహన రాజా. విక్రమ్ కూడా సానుకూలంగా స్పందించాడని వినికిడి. త్వరలోనే `లూసిఫర్` రీమేక్ లో విక్రమ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
మరి.. చాన్నాళ్ళ తరువాత తెలుగు తెరపై నేరుగా సందడి చేయనున్న విక్రమ్ ఈ సారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.