English | Telugu

ఛీ.. ఛీ బాలయ్య ఇదేం పని..?

సాధారణంగా తన కుటుంబాన్ని అవమానపరిచిన వారిపై ఆ కుటుంబంలోని సభ్యులు గుర్రుగా ఉంటారు. అదను దొరికితే ప్రతీకారం తీర్చుకోకుండా వదలిపెట్టరు. ఇలాంటి చోట అవమానించిన వ్యక్తి పిలిస్తే.. అవమానం పొందిన కుటుంబంలోని సభ్యుడు హాజరైతే ఎలా ఉంటుంది. నానాటికి మరుగున పడుతున్న మాతృభాష వైభవాన్ని నలుదిశలా చాటేందుకు.. తెలుగు భాషను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం.. ఎల్‌బి స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకకి ప్రపంచం నలుమూలల నుంచి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మాతృభాష గొప్పదనాన్ని కొనియాడారు. తెలుగు మహాసభలను కేసీఆర్ ఎంత బాగా నిర్వహిస్తున్నా.. అంతే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి.

తెలుగు జాతి మ‌న‌ది, నిండుగ వెలుగు జాతి మ‌న‌ది-అంటూ తెలుగు వాడి ఆత్మ‌గౌర‌వాన్ని న‌లుదిశ‌లా విశ్వ‌వ్యాప్తం చేసిన యుగపురుషుడు, మ‌హా మ‌నీషి.. నందమూరి తారకరామారావు గారి ప్రస్తావన తెలుగు మహాసభల్లో ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. అంతేనా.. సోదర తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడం.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కవులు, కళాకారులకు పిలుపు లేకపోవడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు స్పందిస్తున్నారు. దీనిపై పబ్లిక్‌గానే కేసీఆర్‌పై పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.

ఏ వేదిక మీద ఎన్టీఆర్ కుటుంబానికి అవమానం జరిగిందో.. అదే వేదికపై ఈ అవమానానికి కారణమైన వ్యక్తిని.. అదే ఎన్టీఆర్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రశంసల్లో ముంచెత్తాడు. ఆయన ఎవరో కాదు ఎన్టీఆర్ కుమారుడు, హీరో బాలకృష్ణ. రాజకీయ నాయకుడిగా కాదు.. సినీ కళాకారుడిగా సభకు హాజరైనట్లు బాలయ్య చెప్పుకుంటున్నా.. ఆయన ఎన్టీఆర్ కుమారుడు కాకపోడు.. ఏపీ ముఖ్యమంత్రి బావమరిది కాకపోడు.. అంతకన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుడన్న విషయాన్ని బాలకృష్ణ మరచిపోకూడదని పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవని కార్యక్రమానికి తాను ఎలా వస్తానని చెప్పిన గరికపాటి వ్యాఖ్యలను ఇక్కడ వినిపిస్తున్నారు. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.