English | Telugu

డిక్టేట‌ర్‌తో బాల‌య్య పుల్‌స్టాప్ పెట్టేస్తాడా?

నంద‌మూరి బాల‌కృష్ణ 99వ చిత్రం.. డిక్టేట‌ర్ ఈ సంక్రాంతికి వ‌స్తోంది. ఆ సంద‌డి క‌న్నా... త్వ‌ర‌లోనే బాల‌య్య సెంచ‌రీ సినిమా చేయ‌బోతున్నాడ‌న్న ఆనందమే అభిమానులలో ఎక్కువుగా క‌నిపిస్తోంది. వందో సినిమాకి స‌ర్వం సిద్ధ‌మైంద‌ని, జూన్‌లో ఈ సినిమా మొద‌లెడ‌తార‌ని విస్ర్కృతంగా ప్ర‌చారం జ‌రిగింది. బోయ‌పాటి శ్రీ‌ను... బాల‌య్య కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థ సిద్ధం చేశాడ‌ని కూడా చెప్పుకొన్నారు. అయితే... బాల‌కృష్ణ దృష్టి వందో సినిమా పైనుంచి.. సీరియ‌స్‌గా రాజ‌కీయాల‌వైపు మ‌ళ్లింద‌ని టాక్‌. వందో సినిమా కంటే.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో మ‌రింత క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించడ‌మే.. ముఖ్య‌మ‌ని బాల‌కృష్ణ భావిస్తున్నార‌న్న వార్త సినీ అభిమానుల్ని విస్మ‌య ప‌రుస్తోంది.

సెంటిమెంట్ ప‌రంగా 99వ సినిమాతో ఆపేస్తే... బాగోదు. అందుకే మోక్ష‌జ్ఞ తొలి సినిమాలో అతిథి పాత్ర వేసి.. వంద సినిమాల మైలు రాయిని అందుకొంటే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు బాల‌య్య వ‌య‌సు కూడా పైబ‌డుతోంది. డిక్టేట‌ర్ ప్ర‌చార చిత్రాల్లో చాలా బొద్దుగా క‌నిపిస్తున్నాడు బాల‌కృష్ణ‌. పెరుగుతున్న త‌న వ‌య‌సుని దృష్టిలో ఉంచుకొని బాల‌య్య ఈ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు చెప్పుకొంటున్నారు.

బాల‌కృష్న వందో సినిమాలో మోక్ష‌జ్ఞ అతిథి పాత్ర‌లో క‌నిపిస్తార‌న్న ప్ర‌చారం ఇది వ‌ర‌కు జ‌రిగింది. అయితే. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మోక్ష‌జ్ఞ తొలి చిత్రంలో బాల‌య్య క‌నిపించి.. వంద సినిమాల ముచ్చ‌ట తీర్చుకోవాల‌ని చూస్తున్నార్ట‌. నిజంగా నంద‌మూరి సీనీ అభిమానుల‌కు ఒక‌ర‌కంగా ఇది చేదు వార్తే!