English | Telugu
కవల పిల్లలకి తల్లిగా స్వీటీ?
Updated : Jun 24, 2021
`అరుంధతి`(2009)తో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ బాట పట్టిన అనుష్క.. ఆపై `పంచాక్షరి` (2010), `వర్ణ` (2013), `రుద్రమదేవి` (2015), `సైజ్ జీరో` (2015), `భాగమతి` (2018), `నిశ్శబ్దం` (2020) వంటి నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో దర్శనమిచ్చింది. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం స్వీటీ మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. ఓ ప్రముఖ తమిళ దర్శకుడు ఇటీవల అనుష్కకి ఓ కథ వినిపించారట. కాన్సెప్ట్, తన రోల్ నచ్చడంతో స్వీటీ కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందట. అంతేకాదు.. ఇందులో కవల పిల్లలకి తల్లిగా అనుష్క కనిపించబోతోందట. పెళ్ళయిన కొద్ది రోజులకే భర్త చనిపోగా.. ఆపై గర్భం దాల్చి కవలలకి జన్మనిచ్చిన మహిళ కథగా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. అంతేకాదు.. సింగిల్ పేరెంట్ గా అనుష్క ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం కథ నడుస్తుందట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం అనుష్క యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. పాతికేళ్ళ యువకుడితో ప్రేమలో పడ్డ నలభై ఏళ్ళ అవివాహిత మహిళ కథగా ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం. స్వీటీ లక్కీ బేనర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి `రా రా కృష్ణయ్య` ఫేమ్ మహేశ్ దర్శకుడు. మొత్తమ్మీద.. గత కొంతకాలంగా వైవిధ్యభరితమైన పాత్రలతోనే స్వీటీ ప్రయాణం సాగుతోందని చెప్పాలి.